స్టార్ లింక్ కు కేంద్రం కంట్రోల్ సెంటర్.. ఆ కండిషన్ కు ఓకే అంటేనే?
అయితే, భారత్ లో స్టార్ లింక్ ప్రవేశం చాలా షరతులతో ముడిపడి ఉంటుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 15 March 2025 12:00 AM ISTస్టార్ లింక్.. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధంలో ఇంటర్నెట్ ను దెబ్బతీస్తే స్టార్ లింక్ కనెక్షన్ ఇచ్చారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఇప్పుడు స్టార్ లింక్ భారత్ లో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఆ సంస్థతో భారతీయ టెలికం దిగ్గజాలు ఎయిర్ టెల్, జియో జట్టు కట్టనున్నాయి.
స్టార్ లింక్ గనుక భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే అది పెద్ద విప్లవమే అని చెప్పొచ్చు.. కారణం.. ఉపగ్రహ ఆధారిత సర్వీస్ కావడమే. భారత్ వంటి అతిపెద్ద మార్కెట్లో మారుమూల ప్రాంతాలకూ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
అయితే, భారత్ లో స్టార్ లింక్ ప్రవేశం చాలా షరతులతో ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మస్క్ కే చెందిన టెస్లా సంస్థ భారత మార్కెట్లోకి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఇలానే స్టార్ లింక్ కూ రూల్స్ వర్తిస్తాయి. వాటికి అంగీకరిస్తేనే సేవలకు అనుమతి అని కేంద్రం పేర్కొన్నట్లు సమాచారం.
మా కంట్రోల్ ఉండాలి..
భారత్ లో స్టార్ లింక్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది కేంద్రం స్పష్టం చేసిందట. తెలుస్తోంది. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలపై అదుపు కోసమే ఈ నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్య తలెత్తితే చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం స్టార్ లింక్ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. మన దేశంలో ఏదైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే అమెరికా కార్యాలయాన్ని అత్యవసరంగా సంప్రదించడం కంటే.. భారత్ లోనే నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉండాలనేది కేంద్రం ఆలోచన.ఇక విపత్తులు, ప్రజా భద్రత వంటి అత్యవసర పరిస్థితుల్లో నేరుగా టెలికాం సర్వీస్ లను తమ నియంత్రణలోకి తీసుకునేందుక, కాల్స్ ను యాక్సెస్ చేసుకునేలా సెక్యూరిటీ అనుమతులు ఉండాలని కేంద్రం తేల్చి చెప్పిందట.
దిగ్గజ సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ లకూ ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయని సూచించిందట. దీంతో స్టార్ లింక్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలో అభిప్రాయాన్ని చెబుతామని తెలిపిందట. ఇక స్టార్ లింక్ ఆ పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం అనుమతి రావడం లాంచనమే. ప్రస్తుతం స్టార్ లింక్ దరఖాస్తు కేంద్ర హోం శాఖ వద్ద ఉంది.