Begin typing your search above and press return to search.

స్టార్ క్రికెటర్ వర్సెస్ స్టార్ స్పోర్ట్స్.. వివాదంలో చివరకు ఏం జరిగింది?

దీని ఓటీటీ ప్రసార హక్కులు చేజారడం స్టార్ స్పోర్ట్స్ కు కోలుకోలేని దెబ్బ. కాగా ఇలాంటి స్టార్ స్పోర్ట్స్ తాజాగా స్టార్ క్రికెటర్ తో వివాదంలో చిక్కుకుంది

By:  Tupaki Desk   |   21 May 2024 8:00 AM GMT
స్టార్ క్రికెటర్ వర్సెస్ స్టార్ స్పోర్ట్స్.. వివాదంలో చివరకు ఏం జరిగింది?
X

ఒక స్పోర్ట్స్ సెలబ్రిటీ.. మరో స్పోర్ట్స్ చానెల్.. మధ్యలో వ్యక్తిగత గోప్యత అంశం రచ్చ రేపింది. గతంలో ఏమో కానీ.. వివిధ రకాల స్పోర్ట్స్ చానళ్లు వచ్చాక వాటి మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. జియో వచ్చాక మూడు సీజన్లుగా ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందిస్తోంది. దీంతో అంతకుముందులా స్టార్ స్పోర్ట్స్ హవా సాగడం లేదు. జియోతో పోటీ పడలేక స్టార్ చేతులెత్తేసింది. వివిధ సిరీస్ ల హక్కులు దక్కించుకుంటున్నా.. వాటిని మించినది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). దీని ఓటీటీ ప్రసార హక్కులు చేజారడం స్టార్ స్పోర్ట్స్ కు కోలుకోలేని దెబ్బ. కాగా ఇలాంటి స్టార్ స్పోర్ట్స్ తాజాగా స్టార్ క్రికెటర్ తో వివాదంలో చిక్కుకుంది.

ఇంతకూ ఏం జరిగింది?

ఈ నెల 17న లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తో ముంబై లీగ్ మ్యాచ్ ఆడింది. దీనికిముందు ముంబై వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన స్నేహితులతో మాట్లాడుతుండగా స్టార్ స్పోర్ట్స్ దానిని రికార్డు చేసింది. దీంతో ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగించేలా ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రయత్నిస్తోందని.. ఆటగాళ్ల సంభాషణలను రికార్డు చేస్తోందని రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనికిముందు ప్రాక్టీస్ సందర్భంగా కోల్ కతా అసిస్టెంట్ కోచ్.. తన ముంబై రంజీ స్నేహితుడు అభిషేక్ నాయర్‌ తో రోహిత్ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్ టీమ్ లో చీలిక వచ్చినట్లు, రోహిత్ వచ్చే సీజన్ లో జట్టు మారనున్నట్లు కథనాలు ప్రసారం అవుతుండగా అతడు నాయర్ తో మాట్లాడిన అంశానికి ప్రాధాన్యం దక్కింది. ఇందులో ‘భాయ్ నాదేముంది.. ఇదే చివరిది’ అని రోహిత్ అన్నట్లుగా వినిపించింది. ఈ వీడియోను కోల్ కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. తర్వాత డిలీట్ చేయడం జరిగింది. అయితే, అప్పటికే నష్టం జరిగిపోయింది. కాగా, ఈ వీడియోనే రచ్చ రేపిందంటే.. లఖ్ నవూతో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ.. టీమిండియా మాజీ ప్లేయర్ ధవళ్ కులకర్ణి మధ్య సంభాషణను కెమెరామెన్ రికార్డు చేశాడు. దీంతోనే రోహిత్ అప్రమత్తమయ్యాడు. ‘బ్రదర్ ఆడియోను మ్యూట్ చెయ్.. ఇప్పటికే ఒక వీడియో వైరల్ అయింది. చాలా సమస్యలు వచ్చాయి’ అని కోరాడు. ఈ రెండు ఘటనల తర్వాత రోహిత్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల సంభాషణలను రికార్డు చేయడంపై స్టార్ స్పోర్ట్స్‌ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీడియో రికార్డు చేయవద్దని ఐపీఎల్ స్టార్ స్పోర్ట్స్‌ కు వివరించినా.. అలాగే ప్రసారం చేసిందని నిందించాడు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం బ్రాడ్‌కాస్టర్లు చేస్తున్న ప్రయత్నాలు.. ఫ్యాన్స్, క్రికెటర్ల మధ్య చిచ్చ పెడుతున్నాయని పేర్కొన్నాడు.

ఆ క్లిప్ ను మాత్రమే ప్రసారం చేశాం

రోహిత్ ఆరోపణలను స్టార్ స్పోర్ట్స్ ఖండించింది. రోహిత్ ఇతరులతో మాట్లాడే వీడియోను బ్రాడ్ కాస్టర్‌ గా చూపించాం. సంభాషణ జరుగుతున్నప్పుడు ఆడియోను రికార్డు చేయడం గానీ.. ప్రసారం చేయడం కానీ, చేయలేదు. అయితే, తన సంభాషణ ఆడియోను రికార్డు చేయవద్దని రోహిత్ కోరిన క్లిప్‌ ను మాత్రమే.. మా ప్రీ మ్యాచ్ లైవ్ కవరేజీలో ప్రసారం చేశాం. ఆటగాళ్ల ప్రైవసీని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం’ అని స్టార్ స్పోర్ట్ వివరణ ఇచ్చింది.