Begin typing your search above and press return to search.

ఇదే తాజా సంకేతం... మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్లే..!?

ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్లే అని ఒకరంటే... ఇప్పటికే మొదలైదని చెప్పే అంశం ఒకటి తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   13 April 2024 5:35 AM GMT
ఇదే తాజా సంకేతం... మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్లే..!?
X

ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్లే అని ఒకరంటే... ఇప్పటికే మొదలైదని చెప్పే అంశం ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్‌ పై ఇరాన్‌ దాడి చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారిందని అంటున్నారు. ఇదే సమయంలో... రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్‌ అవీవ్‌ పై విరుచుకుపడేందుకు టెహ్రాన్‌ సమాయత్తమైందంటూ అమెరికా నిఘా వర్గాలు చెప్పడం ఇప్పుడు తీవ్రకలకలానికి దారితీస్తోంది!

మరోవైపు ఇజ్రాయెల్‌ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఈ సమయంలో ఇజ్రాయేల్ ప్రధాని బెంజమేన్ నెతన్యాహుకు అగ్రరాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ఇండియా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయేల్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కు మద్దతుగా రష్యా, కువైట్, ఖతర్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయని తెలుస్తుంది. ఈ సందర్భంగా మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేచినట్లే అనే సంకేతాలు తెరపైకి వస్తున్నాయి.

దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా... అమెరికా, బ్రిటన్‌, భారత్‌, ఫ్రాన్స్‌, చైనా తదితర దేశాలు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేయగా... ఫ్రెంచ్‌ దౌత్యవేత్తలు కుటుంబాలతో సహా తక్షణం టెహ్రాన్‌ ను వీడాలని ఫ్రాన్స్‌ ఆదేశించింది. ఇదే క్రమంలో... భారత పౌరులెవ్వరూ ఇజ్రాయెల్‌, ఇరాన్‌ కు ప్రయాణాలు చేయొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు టెహ్రాన్‌ కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌ లైన్స్‌ ప్రకటించింది.

ఈ క్రమంలో... సిరియాలోని ఇరాన్‌ రాయబారి కార్యాలయంపై రెండు వారాల క్రితం జరిగిన దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందినప్పటి నుంచి ఇరాన్‌ ఆగ్రహంతో రగులుతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో... ఇజ్రాయెల్‌ కు అండగా ఇరాన్‌ పై అమెరికా దాడి చేస్తే తాము సహకరించబోమని ఖతార్‌, కువైట్‌ వంటి అరబ్ దేశాలు అగ్రరాజ్యానికి తేల్చి చెప్పాయి.

భారత పౌరులకు విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిక:

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ కు ప్రయాణాలు చేయొద్దని భారత పౌరులను విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, రాయబార కార్యాలయంలో వారి వారి వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. కాగా... ఇరాన్‌ లో 4 వేల మంది, ఇజ్రాయెల్‌ లో దాదాపు 18,500 మంది భారతీయులు ప్రస్తుతం నివసిస్తున్నారు.