Begin typing your search above and press return to search.

ఈ ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అవుతారా ?

దేశంలో జమిలి ఎన్నికల మీద వాడిగా వేడిగా చర్చ అయితే సాగుతోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 9:30 AM GMT
ఈ ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అవుతారా ?
X

దేశంలో జమిలి ఎన్నికల మీద వాడిగా వేడిగా చర్చ అయితే సాగుతోంది. అది ఎంతవరకూ పాజిబుల్ అన్నది కూడా అంతా తలో రకంగా ఆలోచన చేస్తున్నారు. జమిలి ఎన్నికలు అంటే ఇపుడున్న ప్రభుత్వాలు అయిదేళ్ళ పాటు ఉండవన్న మాట. మధ్యలో కూలుతాయి. మరి అదే జరిగితే తొందరగా ఎన్నికలు వస్తాయి. దాంతో అధికారం మీద కుర్చీల మీద కొత్త వారికి కూడా ఆశలు పెరుగుతాయి. రేసులో కొత్త వారు కూడా దూసుకుని వస్తారు.

ఇదిలా ఉండగా దక్షిణాదిన పవర్ ఫుల్ ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరందరినీ ఫ్యూచర్ సీఎంలుగా కూడా వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. కాబోయే సీఎంలు వీరే అని కూడా అభిమాన జనం గొంతెత్తి నినదిస్తున్నారు కూడా. చిత్రమేంటి అంటే వీరంతా ఏకైక ఉప ముఖ్యమంత్రులుగా ఆయా రాష్ట్రాలలో చలామణీ అవుతున్నారు. సీఎంలతో సమానంగా గౌరవ మర్యాదలు అందుకుంటున్నారు.

ముందుగా చూస్తే కర్ణాటకలో ముఖ్యమంత్రి అవుతారు అని అంతా అనుకున్న డీకే శివకుమార్ సిద్దరామయ్య ముఖ్యమంత్రిత్వంలో ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన ఏనాటికి అయినా సీఎం అవుతారు అని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతూంటారు. 2028లో ఇక్కడ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. అయితే జమిలి ఎన్నికలు వస్తే 2026 చివరిలో కానీ 2027 మొదట్లో కానీ ఎన్నికలు తోసుకుని వస్తాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం నుంచి సీఎం గా ప్రమోట్ అవుతారు అని అంటున్నారు.

అదే విధంగా తెలంగాణాలో రేవంత్ రెడ్డి సీఎం అయితే డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన కూడా సీఎం రేసులో చాలా గట్టిగా నిలబడ్డారు. ఆయనకు చాన్స్ ఉందని అంతా అంటున్నారు కూడా. జమిలి ఎన్నికలు అంటూ జరిగితే ఇక్కడ కూడా 2028లో జరగాల్సిన ఎన్నికలు ముందే వస్తాయి. దాంతో ఉప ముఖ్యమంత్రి సీటు నుంచి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన అనుచర వర్గం లెక్కలేసుకుంటోంది అని అంటున్నారు.

ఇక ఏపీలో చూసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ సీఎం కావాలని ఆయన అనుచరులు బలంగా కోరుకుంటున్నారు. ఈసారికి డిప్యూటీ సీఎం అయినా వచ్చేసారికి పవనే సీఎం అని ఆయన అనుచర వర్గం గట్టిగా నమ్ముతోంది. ఏపీలో 2029లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలి ఎన్నికలు వస్తే కనుక మరో రెండేళ్ళు ముందుగానే వస్తాయి. దాంతో పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి చాన్స్ కచ్చితంగా ఉంటుందని నమ్ముతున్న వారే హెచ్చుగా ఉన్నారు జనసేనలోపలా బయటా కూడా.

తమిళనాడులో చూసుకుంటే ఇటీవలే స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. షెడ్యూల్ ప్రకారం 2026లోనే ఇక్కడ ఎన్నికలు జరగాలి. జమిలి ఎన్నికలు జరిగినా జరగకపోయినా తమిళనాడులో అయితే ఆ టైం కి ఎన్నికలు తప్పవు. ఆ ఎన్నికలు జరిగి డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తే కనుక ఉదయనిధి ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ అని అంటున్నారు.

అంటే ఈ నలుగురు డిప్యూటీలలో గ్యారంటీగా ముఖ్యమంత్రి అయ్యేది జమిలితో సంబంధం లేకుండా ఉదయనిధి అని అంటున్నారు. చిత్రమేంటి అంటే ఒకేసారి కీలకమైన నాలుగు రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వారు అంతా అత్యంత శక్తిమంతులు అందరూ సీఎం క్యాండిడేట్లు. చాన్స్ దొరికితే చాలు వారిదే సింహాసనం అన్నట్లుగానే పొలిటికల్ సీన్ అయితే ఉంది మరి. జమిలి ఎంత మంది ఆసలను తీరుస్తుందో చూడాల్సి ఉంది.