Begin typing your search above and press return to search.

రాష్ట్రాలకు కోత పెడుతున్న మోడీ సర్కార్ ?

బీజేపీ రాష్ట్రాలకు రూపాయికి ఏడు రూపాయల దాకా కేంద్రం నుంచి నిధులు అందుతాయని అదే విపక్షాల రాష్ట్రాలకు ఎంత ఆదాయం కేంద్రానికి పన్నుల రూపంలో ఇచ్చినా నలభై నుంచి యాభై పైసల వద్దనే నిధులు ఇస్తారని విమర్శలు చేస్తూంటారు.

By:  Tupaki Desk   |   6 March 2025 3:00 AM IST
రాష్ట్రాలకు కోత పెడుతున్న మోడీ సర్కార్ ?
X

దేశంలోని 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎన్డీయే పాలిత రాష్ట్రాలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అన్న వివక్ష ఉందని ఇండియా కూటమి నేతలు అంటూంటారు. బీజేపీ రాష్ట్రాలకు రూపాయికి ఏడు రూపాయల దాకా కేంద్రం నుంచి నిధులు అందుతాయని అదే విపక్షాల రాష్ట్రాలకు ఎంత ఆదాయం కేంద్రానికి పన్నుల రూపంలో ఇచ్చినా నలభై నుంచి యాభై పైసల వద్దనే నిధులు ఇస్తారని విమర్శలు చేస్తూంటారు.

ఇక జీఎస్టీ వచ్చాక రాష్ట్రాలు సొంతంగా పన్నులు వేసుకుని నిధులను పొందే సౌలభ్యం లేకుండా పోయింది అన్నది ఉంది. అంతే కాదు బీజేపీ ఏలుబడిలో స్పెషల్ గ్రాంట్స్ అన్నవి కూడా పెద్దగా లేవని రాష్ట్రాల పట్ల సానుకూలత ఉంటే ఉదారంగా అప్పులు చేసుకునేందుకు మాత్రమే వీలు కల్పిస్తుందని కూడా విమర్శిస్తుంటారు.

ఇక ప్రకృతి విపత్తులు వచ్చినపుడు కూడా కేంద్రం నుంచి గతంలో మాదిరిగా పెద్దగా సాయం ఇపుడు అందడం లేదు అన్నది కూడా చర్చగా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ద్రవ్య లోటుని పూడ్చుకునేందుకు రాష్ట్రాలకు పన్నుల ద్వారా ఇవ్వాల్సిన వాటాలలో కోత పెట్టడానికి చూస్తోంది అన్నది ఇపుడు ఒక ప్రచారంగా ముందుకు వస్తోంది.

రాష్ట్రాలకు కేంద్రం నుంచి దక్కాల్సిన పన్నుల వాటాను తగ్గించేందుకు ఆర్ధిక శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా రాయిటర్స్ ఒక సంచలన కధనాన్ని ప్రచురించింది. ఈ కధనం ప్రకారం చూస్తే ఇప్పటిదాకా కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నుల ద్వారా 41 శాతం వాటా వచ్చేది. తాజా ప్రతిపాదనల ప్రకారం దీనిని ఒక్క శాతం వాటా తగ్గించి నలభై శాతానికి పరిమితం చేయాలని చూస్తోంది అని అంటున్నారు.

ఇలా కేవలం ఒక్క శాతం వాటాలో కోత పెట్టడం వల్ల కేంద్రానికి ఏకంగా 35 వేల కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుందని రాయిటర్స్ కధనం వెల్లడించింది. ఆర్ధికవేత్త అరవింద్ పనగరియా నాయకత్వంలోని ఆర్ధిక సంఘానికి ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించినట్లుగా చెబుతున్నారు.

ఈ నెలాఖరులో జరిగే కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి ఆ మీదట పరిశీలన కోసం ఆర్ధిక సంఘానికి పంపుతారని అంటున్నారు. ఇక ఈ నిర్ణయానికి ఆర్ధిక సంఘం కనుక ఓకే చెబుతే 2025-26 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ కోత అమలుకోకి వస్తుంది. దాని వల్ల రాష్ట్రాలకు దక్కే కేంద్ర పన్నులలో వాటా సొమ్ము గణనీయంగా తగ్గిపోతుంది అని అంటున్నారు.

దీని వల్ల రాష్ట్రాలు మరింతగా ఆర్ధికంగా ఇబ్బందులోకి వెళ్తాయని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ లాంటి రాష్ట్రాలు అప్పుల మీద నడుస్తున్నాయి. ఇక మీదట సంక్షేమానికి కాదు కదా అభివృద్ధికి కూడా నిధుల కోసం తీవ్ర కొరత వస్తుందని అంటున్నారు. కేంద్రం ద్రవ్య లోటుని పూడ్చుకోవడానికి రాష్ట్రాల పన్నుల వాటలో కోత పెట్టడం ఏమిటి అన్నది విపక్షాల నుంచి మెల్లగా వినిపిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపిస్తే మరి విపక్షాలు ఏ రకంగా ప్రతిఘటిస్తాయన్నది చూడాల్సి ఉంది.