పురందేశ్వరి నకిలీల గోల..కేంద్రానికి చెప్పరాదమ్మా?: స్టేట్‌బీజేపీ టాక్
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చేందు కు అడ్డదారులు తొక్కుతోందని ఆమె అన్నారు.
By: Tupaki Desk | 25 Jan 2024 8:58 AM GMTబీజేపీ ఏపీ అధ్యక్షురాలు.. పురందేశ్వరి వ్యవహారం ఎవరికీ అంతు చిక్కడం లేదు. చేతిలో కేంద్ర ప్రభుత్వా న్ని పెట్టుకుని.. ఆమె రోడ్లపై చిందులు ఎందుకు తొక్కుతున్నారనేది ఆ పార్టీ నేతలే అంటున్నారు. అంతే కాదు.. అనవసరమైన విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారనే పెదవి విరుపులు కూడా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ జాబితాను ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా సవరిం చారు. అన్నీ పక్కాగానే ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అయితే.. బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాత్రం.. మళ్లీ ఈ తేనెతుట్టెను కదిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చేందు కు అడ్డదారులు తొక్కుతోందని ఆమె అన్నారు. అంతేకాదు.. ఓటర్ల జాబితాలో అవకతవకలు అలానే ఉన్నాయని.. ఈ నెల 27 నుంచి తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని సెలవిచ్చారు.
అయితే.. వాస్తవానికి.. ఈ విషయాన్ని ఆమె తేల్చుకోవాలంటే.. నేరుగా.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించవచ్చు. లేదా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు్త్వంతోనే తేల్చుకోవచ్చు. కానీ, ఆమె ఈ రెండు విధానాలను వదిలేసి.. రోడ్డెక్కుతానని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనపై బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. ''కేంద్రంలో ఉన్నదిమేమే. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే.. చిటికెలో మార్పు కనిపిస్తుంది. ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు'' అని ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాను పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. ''వచ్చే ఎన్నికల్లో మనం అనుసరించే వ్యూహం ఏంటి? ప్రజలను ఏవిధంగా మచ్చిక చేసుకోవాలి.
ఏయే పథకాలపై దృష్టి పెట్టాలి? అనే అంశాలను పరిశీలించాలి. ఈ విషయాన్ని వదిలేసి.. లేనిపోని విషయాలను భుజాన వేసుకోవడం వల్ల టైం వేస్ట్'' అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మరి పురందేశ్వరి ఆదిశగా అడుగులు వేస్తారో.. లేక ఉన్న కీలక సమయాన్ని ఇలా వృథా చేసుకుంటారో చూడాలి.