సాయం కోసం కువైట్ వెళ్లాలనుకున్న ఆ రాష్ట్ర మంత్రికి మోడీ సర్కారు నో
కానీ.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ కేంద్రం పెద్దన్న పాత్ర వహిస్తూ.. అప్పుడప్పుడు కొన్ని అంశాల్లో కర్ర పెత్తనం చూస్తున్నదే.
By: Tupaki Desk | 20 Jun 2024 5:02 AM GMTఅధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాలనుకున్న రాష్ట్ర మంత్రులకు కేంద్రం నుంచి క్లియరెన్సు రావాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఈ అధికారం ఒక రాష్ట్రానికి కేంద్రానికి మధ్య కొత్త చిచ్చుకు కారణమైంది. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల మాదిరి వ్యవహరించాల్సిందే. కానీ.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ కేంద్రం పెద్దన్న పాత్ర వహిస్తూ.. అప్పుడప్పుడు కొన్ని అంశాల్లో కర్ర పెత్తనం చూస్తున్నదే.
తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించింది మోడీ సర్కారు. కేరళకు చెందిన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి వీణాజార్జి కువైట్ కు వెళ్లాలనుకున్నారు. దీనికి కారణం.. కువైట్ లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మరణించటం.. ఇందులో ఎక్కువగా కేరళకు చెందిన వారు ఉండటం తెలిసిందే. ఈ విషాద ఉదంతానికి సంబంధించి సహాయక చర్యల సమన్వయానికి తమ రాష్ట్రానికి చెందిన మంత్రిని కువైట్ కు పంపాలని కేరళ ముఖ్యమంత్రి విజయన్ భావించారు. ఇందులో భాగంగా కేంద్రం నుంచి అవసరమైన క్లియరెన్సు కోసం ఫైల్ పంపారు.
కానీ.. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదన్న విషయాన్ని తాజాగా బయట పెట్టారు. కేంద్రంలోని మోడీ సర్కారు సమాఖ్య వ్యవస్థ తీరుకు భిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ మంత్రి కువైట్ పర్యటనకు కేంద్రం నో చెప్పటాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ అంశంపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒకలేఖ రాశారు. అంతేకాదు.. తమ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపిన లేఖను ఆయన బయటపెట్టారు.
విదేశీ వ్యవహారాల శాఖ తమ వినతికి సానుకూలంగా స్పందించకపోవటాన్నిఆయన ప్రశ్నిస్తూ.. ఇది చాలా దురద్రష్టకరమని.. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో మరింత బాధ్యతాయుతంగా ఉండేలా ఆ శాఖకు ప్రధానమంత్రి సలహా ఇవ్వాలన్నారు. అనూహ్య విషాదం విరుచుకుపడిన వేళ.. విషాదంలో మునిగిన బాధిత కుటుంబాలకు తాము సరైన సమయంలో వెళ్లి ఉంటే.. వారికి మానసిక ఉపశమనం.. విశ్వాసం కలిగేవన్న ఆయన.. ‘‘కేంద్ర మంత్రిత్వ శాఖ తీరును వివాదాస్పదం చేయటం మా ఉద్దేశం కాదు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయ అనుమతులు సకాలంలో ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయంగా మిగులుతాయి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ద్రష్టికి తీసుకెళ్లటమే మా ఉద్దేశం’’ అంటూ తన ఆగ్రహాన్ని పెద్ద మనిషి తరహాలో వెల్లడించారు. మరి..దీనికి ప్రధాని మోడీ రియాక్టు అవుతారా?