Begin typing your search above and press return to search.

న్యాయదేవత కళ్లకు గంతలు తొలిగాయి.. కళ్లారా చూస్తూ సమన్యాయం

వందల ఏళ్ల పాటు పాలన సాగించిన బ్రిటీష్ విధానాల్ని యథాతధంగా నేటికి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:08 AM GMT
న్యాయదేవత కళ్లకు గంతలు తొలిగాయి.. కళ్లారా చూస్తూ సమన్యాయం
X

వందల ఏళ్ల పాటు పాలన సాగించిన బ్రిటీష్ విధానాల్ని యథాతధంగా నేటికి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కొన్నింటిని మార్చేస్తున్నప్పటికీ.. మరికొన్ని విషయాల్లో మార్పులు లేని పరిస్థితి. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి.. సమన్యాయం.. అందరూ చట్టం ముందు సమానమనే వాదనకు భిన్నంగా తాజాగా సరికొత్త వాదనతో న్యాయదేవత కళ్లకు గంతలు తీసేసిన తొలి సందర్భం తాజాగా చోటు చేసుకుంది. అంతేకాదు ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారతరాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంతకూ ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఇంతకాలం కళ్లకు గంతలు కట్టిన న్యాయదేవతకు చెప్పిన భాష్యానికి భిన్నంగా ఇప్పుడేం చెబుతున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఇదంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో సరికొత్త న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. చట్టానికి కళ్లు లేవన్న పాత సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు. న్యాయదేవత కళ్లకు గంతలు తీసేశారు. కళ్లారా చూస్తూ.. సమన్యాయం అందించే న్యాయదేవత ఇప్పుడు తెర మీదకు వచ్చినట్లైంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలతో న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్లు లేని కబోది కాదని.. బ్రిటిష్ వలస వాసనల్ని వదిలించుకొని భారత న్యాయవ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని ఆయన భావించారు. రాజుల కాలం నాటి ఖడ్గం తీరపు చెప్పటానికి బదులుగా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సీజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు చేపట్టారు. ఎప్పటిలానే కుడి చేతిలో త్రాసును ఉంచేశారు. న్యాయం అందరికి సమానమేనని.. ఎవరికి ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవన్న విషయాన్ని స్పష్టం చేసే త్రాసును మాత్రం అలానే ఉంచేశారు.

అంతేకాదు.. విదేశీ వనిత వేషధారణలో కాకుండా రెండు చేతులకు గాజులు.. నగలు.. నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితలా స్వచ్ఛతను స్పురణకు తెచ్చేలా న్యాయదేవతకు తుదిరూపు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆసక్తికర చర్చకు తెర తీశాయి. ఇన్నేళ్ల తర్వాత న్యాయదేవతకు కొత్త రూపు ఇచ్చిన వైనం మారుతున్న భారతసమాజానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పక తప్పదు.