Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక తీర్పు

దీంతో హరీశ్‌రావుపై పోలీసులు కేసు నమోదైంది. ఈ కేసులో హరీశ్‌రావుకు ఊరట లభించింది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 9:17 AM GMT
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక తీర్పు
X

తన ఫోన్లను ట్యాప్ చేయించారని సిద్దిపేటకు గదగోని చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీమంత్రి హరీశ్‌రావు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్‌రావుపై పోలీసులు కేసు నమోదైంది. ఈ కేసులో హరీశ్‌రావుకు ఊరట లభించింది.

అదే సమయంలో హరీశ్ రావు స్పందిస్తూ పోలీసులు ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని, ఆధారాలు లేకుండానే తనపై ఫిర్యాదు చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఘటన ఆధారంగా తనపై చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారం అయినవేనని వెల్లడించారు. నిరాధార ఆరోపణలతో తనను అరెస్ట్ చేస్తే తన రాజకీయ జీవితానికి, ప్రతిష్టకు హాని జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

గురువారం ఉదయం జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను సమీక్షించింది. కాంగ్రెస్ నాయకుడి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో హరీశ్‌రావుకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. హరీశ్ అరెస్టుపై స్టే విధించింది. విచారణ కొనసాగించేందుకు పోలీసులకు అనుమతిస్తూనే.. అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో విచారణకు సహకరించాలని హరీశ్‌రావుకు సూచించింది.

మరోవైపు.. బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఉదయం హరీశ్ రావుతోపాటు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. కౌశిక్‌ అరెస్టును అడ్డుకునేందుకు హరీశ్‌రావు కౌశిక్ ఇంటికి రావడంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.