Begin typing your search above and press return to search.

యూఎస్ లో యాపిల్ ఫోన్ ఎందుకు తయారుకాదు?

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు తాము వాడాలనుకునే స్మార్ట్ ఫోన్ లో మొదటి చాయిస్ ఐఫోనే.

By:  Tupaki Desk   |   14 April 2025 4:00 AM
యూఎస్ లో యాపిల్ ఫోన్ ఎందుకు తయారుకాదు?
X

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు తాము వాడాలనుకునే స్మార్ట్ ఫోన్ లో మొదటి చాయిస్ ఐఫోనే. ఇక.. అమెరికన్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. యాపిల్ ఫోన్ కే తమ తొలి ప్రాధాన్యతను ఇవ్వటం తెలిసిందే. ఇంతలా మనసు దోచుకునే యాపిల్ ఫోన్ అమెరికాలో ఎందుకు తయారు కాదు? అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. ఇదే విషయాన్ని గతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వచ్చింది. ఆయన యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ ను నేరుగా అడిగేశాడు. అందుకు ఆయన అంతే నిర్మోహమాటంగా సమాధానం ఇచ్చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అప్పట్లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు చర్చగా మారింది. స్టీవ్ సమాధానం వైరల్ అవుతోంది.

ఐఫోన్ ను అమెరికాలో ఉత్పత్తి చేయటం అంత సులువు కాదని.. అందుకు అవసరమైన పరిస్థితులు అమెరికాలో లేవని చెబుతారు. 2011 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఒక ప్రైవేటు సమావేశం జరిగింది. దీనికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ తో సహా సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన కార్పొరేట్ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఒబమా మాట్లాడుతూ.. ఐఫోన్ ను అమెరికాలో ఉత్పత్తి చేయటానికి ఏం కావాలని స్టీవ్ జాబ్స్ ను ఒబామా ప్రశ్నించారు. అప్పట్లో ఆయన ఇచ్చిన సమాధానం.. స్టీవ్ మరణించిన తర్వాత న్యూయార్క్ టైమ్స్ లో హైలెట్ కావటం గమనార్హం. ఒబామా ప్రశ్నకు స్టీవ్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. ‘‘యాపిల్ ఫోన్ల తయారీకి యూఎస్ కంటే ఇతర దేశాలే అనుకూలం’’ అని కుండ బద్ధలు కొట్టేశారు.

ఇంతకూ ఐఫోన్ ను ఇతర దేశాల్లో ఎందుకు ఉత్పత్తి చేస్తారు? అమెరికాలో ఎందుకు కాదంటే.. చైనా లాంటి దేశాలు దశాబ్దాల కాలంగా అత్యంత ప్రత్యేకమైన తయారీ పర్యావరణ వ్యవస్థను డెవలప్ చేయటం ఒక కారణంగా చెబుతారు. అందులో నైపుణ్యం ఉన్న కార్మికులు.. మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు.. అమెరికాలో పని వారికి ఇచ్చే జీతాలు.. ఉత్పత్తి ఖర్చులు తలకు మించిన భారంగా మారతాయి. అమెరికాలో ఐఫోన్లను తయారు చేస్తే వాటి ధర మూడొంతులు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఈ కారణంతోనే చైనా.. భారత్ లాంటి దేశాల్లో ఐఫోన్లను ఉత్పత్తి చేస్తుంటారు.