Begin typing your search above and press return to search.

జస్ట్ 8 రోజుల్లో రూ.25 లక్షల కోట్లు ఆవిరి

ఆ మధ్య వరకు మహా దూకుడు ప్రదర్శించిన స్టాక్ మార్కెట్.. గడిచిన కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలతో బేర్ మంటున్న పరిస్థితి.

By:  Tupaki Desk   |   15 Feb 2025 4:16 AM GMT
జస్ట్ 8 రోజుల్లో రూ.25 లక్షల కోట్లు ఆవిరి
X

ఆ మధ్య వరకు మహా దూకుడు ప్రదర్శించిన స్టాక్ మార్కెట్.. గడిచిన కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలతో బేర్ మంటున్న పరిస్థితి. దీంతో.. అటు సెన్సెక్స్.. ఇటు నిఫ్టీలు నేలచూపులు చూస్తున్న పరిస్థితి. వరుస పెట్టి ఎనిమిది రోజులుగా పడిపోతున్న సూచీల పుణ్యమా అని భారీ నష్టాలు మూటకట్టుకుంటున్న పరిస్థితి. వరుసగా ఎనిమిది రోజులుగా నమోదవుతున్న నష్టాలతో.. దగ్గర దగ్గర రూ.25 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైన పరిస్థితి. దీంతో.. మదుపరులు గగ్గోలు పెట్టేస్తున్నారు.

శుక్రవారం ట్రేడింగ్ ముగిసే నాటికి సెన్సెక్స్ 76వేల పాయింట్ల దిగువకు చేరగా.. నిఫ్టీ కీలకమైన 23 వేల పాయింట్ల స్థాయిని కోల్పోవటం గమనార్హం. చిన్న.. మధ్యస్థాయి షేర్లకు అమ్మకాలు పోటెత్తటంతో సూచీలు నేలచూపులు చూడటమే తప్పించి.. పైకెత్తి చేసే పరిస్థితి ఏ సందర్భంలోనూ లేకుండా పోయింది. బీఎస్ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ.7లక్షల కోట్లు ఆవిరైంది. గడిచిన ఎనిమిది రోజుల ట్రేడింగ్ పుణ్యమా అని రూ.25.31 లక్షల కోట్లకు తగ్గి రూ.400.19 లక్షల కోట్లకు చేరింది.

గడిచిన 8 రోజుల్లో సెన్సెక్స్ 2644 పాయింట్లు కోల్పోతే.. నిఫ్టీ 810 పాయింట్లు నష్టపోయింది. 2024 సెప్టెంబరు 27నాటికి బీఎస్ఈ కంపెనీల మొత్తం నమోదిత విలువ రూ.477.93 లక్షల కోట్లు కాగా.. ఆ విలువలో ఇప్పుడు రూ.77.74 లక్షల వరకు తగ్గటం గమనార్హం. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ లాభాల్లోదూసుకెళ్లింది. అంతకు ముందు రోజు క్లోజింగ్ తో పోలిస్తే 250 పాయింట్లతో ప్రారంభమైంది. ఒక దశలో గరిష్ఠాన్ని తాకిన సూచీ.. అనంతరం నష్టాల్లో జారుకుంది. ఒకదశలో 699 పాయింట్ల వరకు క్షీణించినప్పటికి.. ఆఖర్లో కాస్తంత కోలుకొని 199.7 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 102.1పాయింట్లు తగ్గి 22,929.25 దగ్గర స్థిరపడింది.

సెన్సెక్స్ సూచీలో 21 షేర్లు నష్టాలు చవిచూశాయి. రెండు శాతం కంటే ఎక్కువగా నష్టపోయిన షేర్లలో

- అదానీ పోర్ట్స్ 4.20శాతం

- అల్ట్రాటెక్ 2.47 శాతం

- సన్ ఫార్మా 2.40 శాతం

- ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.19 శాతం

- ఎన్ టీపీసీ 2.18 శాతం నష్టపోయాయి.

ఇక.. ఒకశాతం కంటే ఎక్కువగానష్టపోయిన షేర్ల జాబితాలో టాటా స్టీల్.. ఎం అండ్ ఎం.. యాక్సిక్ బ్యాంక్.. టెక్ మహీంద్రా సంస్థలు ఉన్నాయి. రంగాల వారీగా సూచీల్లో సేవలు షేర్లు 3.16 శాతం.. పరిశ్రమలు 3.03 శాతం..యంత్ర పరికరాలు 2.76 శాతం.. విద్యుత్ 2.65 శాతం.. యుటిలిటీస్ 2.52 శాతం.. మన్నికైన వినిమయ వస్తువులు 2.39 శాతం.. కమొడిటీస్ 2.25 శాతం.. స్థిరాస్తి రంగ సంస్థల షేర్లు 2.03 శాతం నష్టపోయాయి.