ఈ బ్లడ్ బాత్ ఇంకెన్నాళ్లు?
ఇలా ఎన్నో షేర్లు.. వాటి నష్టాల మోత చూస్తే దిమ్మ తిరిగిపోతోంది. దీంతో.. ఎందులో పెట్టుబడి పెట్టాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇక.. మదింపు చేసిన వారు తమ ఫోర్టుఫోలియోలు చూసుకొని తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు.
By: Tupaki Desk | 27 Feb 2025 7:52 AM GMTట్రెంట్ అనే ఒక షేరు ఉంది. అదేనండి మీరు ఏ మాల్ కు వెళ్లినా.. జుడియో.. వెస్ట్ సైడ్ అంటూ భారీ షోరూంలు కనిపిస్తాయే.. టాటా గ్రూపులోని ఈ షేరు విలువ గత ఏడాది అక్టోబరు 10న అక్షరాల రూ.8028. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? గుండె కాస్త గట్టిగా పట్టుకోండి. ఈ రోజు ఆ షేరు ఒక్క దాని విలువ రూ.4827. అంటే దగ్గర దగ్గర ఒక్కో షేరుకు జరిగిన నష్టం రూ.3200లకు పైనే. ఇదో ఉదాహరణ మాత్రమే. స్టాక్ మార్కెట్ ఎంత దారుణమైన నష్టాల్లో నమోదు అవుతుందన్న దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.
ఒక్క షేరు పేరు చెప్పి భయపెడతారా? అంటారా? ఆ మాట చెక్ చేద్దాం. అదానీ షేర్లను వదిలేద్దాం. షేర్ మార్కెట్లో అద్భుతంగా దూసుకెళ్లటం.. అలా అని అంతే దారుణంగా పడని ఒక షేరు ఉంది. ఈ ఉదాహరణ ఎందుకంటే.. ఈ సంస్థ పేరు చెబితే అందరికి ఇట్టే అర్థమవుతుంది కాబట్టి. ఆ షేరు ఐటీసీ. ఈ సంస్థకు సిగిరెట్లు మొదలుకొని ఆటా పిండి వరకు.. హోటల్స్ మొదలుకొని.. బిస్కెట్ల వరకు ఈ కంపెనీ లేని రంగమే లేదన్నట్లుగా ఉంటుంది. గత ఏడాది సెప్టెంబరు 27న ఈ షేరు ఒక్కొక్కటి రూ.494. అలాంటి షేరు ఈ రోజు ధర ఎంతో తెలుసా రూ.400. అంటే.. దగ్గర దగ్గర 25 శాతం వరకు నష్టపోయినట్లు.
ఇలా ఎన్నో షేర్లు.. వాటి నష్టాల మోత చూస్తే దిమ్మ తిరిగిపోతోంది. దీంతో.. ఎందులో పెట్టుబడి పెట్టాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇక.. మదింపు చేసిన వారు తమ ఫోర్టుఫోలియోలు చూసుకొని తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. రోజు రోజుకు పడిపోతున్న సూచీతో ఇన్వెస్టర్ల కళ్లల్లో రక్తం కారుతోంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు లాభాల్లోనే ఉండదు కదా? నష్టాలు మామూలే కదా? అన్న మాట చెప్పొచ్చు. ఈ స్థాయిలో నష్టాలు ఇటీవల కాలంలో చూడలేదనే చెప్పాలి. మరో కీలక అంశం ఏమంటే.. ఈ నష్టాల బాట ఇంకెంత కాలం నడుస్తుందన్న దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవటం కూడా కనిపిస్తోంది. ట్రేడింగ్ జరిగే రెండు సూచీల్లో ఒకటైన నిఫ్టీని చూస్తే.. నష్టాల పతనం ఎంత భారీగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
గడిచిన ఐదు నెలల్లో నిఫ్టీ సూచీ నష్టపోయింది ఏకంగా 13 శాతం. 1990లో ప్రారంభమైన నిఫ్టీ గడిచిన 35 ఏళ్లలో వరుసగా ఐదు నెలలు అంతకంటే ఎక్కువగా నష్టాల్లో కొనసాగిన సందర్భాల్లో ఇది మూడోదిగా చెప్పాలి. 1994 సెప్టెంబరు, 1996 నవంబరులోనూ ఇలాంటి పరిస్థితే. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు అలాంటి పతనాన్ని చూస్తున్న పరిస్థితి. నిఫ్టీ తాజా నష్టాలు 2024 అక్టోబరు నుంచి మొదలయ్యాయి. 2024 సెప్టెంబరు చివర్లో 25,811 పాయింట్ల వద్ద ఉన్న సూచీ ఇప్పటివరకు 12.6 శాతం నష్టపోయి 22,548 పాయింట్లకు దిగి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇప్పటివరకు 4 శాతం పతనమైంది.
నిఫ్టీ సూచీలోని ప్రతి ఐదింటిలో ఒక కంపెనీ షేరు గడిచిన ఐదు నెలల్లో 28 శాతానికి పైగా నష్టపోయింది. కొన్ని షేర్లు అయితే ఏకంగా 33 శాతం వరకు నష్టపోయినవి ఉన్నాయి. గడిచిన ఐదు నెలల్లో లాభాల్లో నమోదైన షేర్లు (6 నుంచి 9 శాతం) ఏమైనా ఉన్నాయి అంటే అవి.. విప్రో.. బజాజ్ ఫైనాన్స్.. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లతో పాటు మరికొన్ని ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది ఈ బ్లడ్ బాత్ ఆగేది ఎప్పుడు? ఈ నష్టాలు రివకరీ కావటానికి ఎంతకాలం పడుతుంది? లాభాల బాట పట్టేది ఎప్పుడూ అన్నది ప్రశ్నలుగా మారాయి.
దీనికి సమాధానాలు వెతికితే.. కార్పొరేట్ సంస్థల లాభదాయకత మెరుగుపడటం.. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు స్థిమితపడటం.. దేశీయంగా సంస్కరణలు కంటిన్యూ అయితే మార్కెట్లు మళ్లీ రాణించే వీలుంది. దీంతో పాటు విదేశీ పెట్టుబడుల తరలిపోవటానికి చెక్ పడటం లాంటివి కూడా సూచీలు పుంజుకోవటానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ పరిస్థితుల్లో కాస్తంత మార్పులు రావాలంటే మరో ఐదారు నెలలు పడుతుందన్న మాట మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పిన విషయాలు అన్నీ కూడా అవగాహన కోసమే తప్పించి.. మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించే ఉద్దేశం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మీరు పెట్టే పెట్టుబడులు.. ట్రేడింగ్ కు ఈ ఆర్టికల్ ఏ మాత్రం బాధ్యత వహించదు. పెట్టుబడులు పెట్టమని చెప్పట్లేదు.. పెట్టొద్దని కూడా చెప్పట్లేదన్నది మర్చిపోకూడదు.