Begin typing your search above and press return to search.

సుఖ సంసారానికి 'స్ట్రోక్' మార్కెట్‌..!

గ‌త వారం బ‌డ్జెట్ కు ముందు త‌ర్వాత‌.. వేల‌కోట్ల రూపాయ‌ల పెట్టుబడులు ఆవిర‌య్యాయి.

By:  Tupaki Desk   |   5 Aug 2024 12:30 PM GMT
సుఖ సంసారానికి స్ట్రోక్ మార్కెట్‌..!
X

స్టాక్ మార్కెట్లు.. వ్యాపార లావాదేవీల‌కు కేంద్రాలు. ఎవ‌రు ఏ క్ష‌ణంలో కుబేరుడు అవుతారో.. ఎవ‌రు ఏ క్షణంలో బికారి అవుతాడో చెప్ప‌లేని విధంగా స్టాక్ మార్కెట్లు ఉంటాయ‌నేది వాస్త‌వం. పెట్టుబ‌డుల విష‌యంలో స్టాక్ మార్కెట్లు ఒక్కొక్క‌సారి అద్భుతాలు సృష్టిస్తే.. ఎక్కువ సార్లు మాత్రం ఇబ్బందుల‌కు దారి తీస్తున్నాయి. భారీ ఎత్తున న‌ష్టాలు తెచ్చి పెడుతున్నాయి. గ‌త వారం బ‌డ్జెట్ కు ముందు త‌ర్వాత‌.. వేల‌కోట్ల రూపాయ‌ల పెట్టుబడులు ఆవిర‌య్యాయి.

అయితే.. వ్యాపారంలో ఈ రిస్క్‌లు కామ‌నే అనుకున్నా.. తాజాగా వెలువ‌డిన ఓ అధ్య‌య‌నం.. స్టాక్ మార్కె ట్ల కార‌ణంగా.. దేశ‌వ్యాప్తంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయ‌ని వివ‌రించింది. పెట్టుబ డులు పెట్టిన వారు.. లాభాల్లో హెచ్చుత‌గ్గుల కార‌ణంగా.. ఒక్కొక్క‌సారి స్టాక్స్ కుప్ప‌కూలిన ఫ‌లితంగా గుండెపోటుకు గుర‌వుతున్నార‌ని తెలిపింది. ఇలా.. దేశ‌వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల ప్ర‌భావంతో గుండెపోటుకు గురైన వారి సంఖ్య 40 % వ‌ర‌కు ఉంద‌ని పేర్కొంది.

ఇక‌, మ‌ర‌ణాల్లోనూ స్టాక్ మార్కెట్ల ప్ర‌భావం ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నట్టు ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఏటా సంభ‌విస్తున్న మ‌ర‌ణాల్లో స్టాక్ మార్కెట్ల కార‌ణంగా.. సంభ‌విస్తున్న న‌ష్టాల‌తోను.. అప్పులు తీర్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతోనూ.. హ‌ఠాత్తుగా గుండె ఆగిపోయి మ‌ర‌ణిస్తున్న‌వారి సంఖ్య 2% ఉంద‌ని.. ఇది ఏటికేడు పెరుగుతున్న‌ట్టు అధ్య‌య‌నం వివ‌రించింది. ఒక్క భార‌త్‌లోనే కాకుండా.. స్టాక్ మార్కెట్ల ప్ర‌భావంతో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య చైనా, జ‌పాన్‌ల‌లోనూ ఎక్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది.

ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్టాక్ మార్కెట్ చైనాలో న‌డుస్తోంది. అయితే.. ఇక్క‌డ కూడా.. మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గానే ఉంద‌ని నివేదిక వివ‌రించింది. గ‌త ఆరేళ్ల కాలంలో కోటి మందికి పైగా స్టాక్ మార్కెట్ల‌లో ఎదుర‌వుతున్న న‌ష్టాల కార‌ణంగా మ‌ర‌ణించిన‌ట్టు అధ్య‌య‌నం విశ్లేషించింది. వారిలో సంస్థాగత పెట్టుబడిదారులతో పోలిస్తే రిటైల్ ఇన్వెస్టర్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు నిర్దారించింది.

సుఖ సంసారానికీ దూరం!

స్టాక్ మార్కెట్ల ప్ర‌భావం అన్యోన్య దాంప‌త్యంపైనా ప్ర‌భావం చూపుతోంద‌ని తాజా నివేదిక పేర్కొంది. స్టాక్ మార్కెట్ న‌ష్టాల ప్ర‌భావం కుటుంబాల‌పై ప‌డుతోంద‌ని..దీంతో దాంప‌త్య బంధంలో తేడా వ‌స్తోంద‌ని.. భార్యా భ‌ర్త‌లు ప్రశాంతంగా జీవించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని పేర్కొంది. అంతేకాదు.. మ‌ద్యం వంటి దుర్వ్య‌సనాల‌కు అల‌వాటు ప‌డేలా చేస్తోద‌ని కూడా.. తెలిపింది. ఎక్కువ భాగం న‌ష్టాలు పోతున్న వారు.. ఒత్తిడి, అల‌స‌ట‌కు గురై.. మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని.. చివ‌ర‌కు ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌క్ష‌వాతం వంటి జ‌బ్బుల‌కు కూడా ఇది దారితీస్తోంద‌ని వెల్ల‌డించింది.