Begin typing your search above and press return to search.

బాబు ప్రకటనతో కోలుకున్న స్టాక్ మార్కెట్ తిరిగి ఊపులోకి!

బీజేపీకి 250 కంటే తక్కువ సీట్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న సంశయాల కారణంగా మంగళవారం ఒక్కరోజులో భారీగా నష్టపోయింది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 10:37 AM
బాబు ప్రకటనతో కోలుకున్న స్టాక్ మార్కెట్ తిరిగి ఊపులోకి!
X

స్టాక్ మార్కెట్ ఎంత సున్నితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అంశాలు సైతం పెద్ద పెద్ద పరిణామాలకు కారణమవుతుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒకరోజు ముందు ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో భారీ లాభాలు నమోదు కావటం తెలిసిందే. అయితే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని సంశయాలు.. భయాలతో ఉన్న అనిశ్చితి స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ కు కారణమైంది.

టీవీల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న కొద్దీ.. ఎన్డీయే కూటమి 370 సీట్ల సంగతి తర్వాత మేజిక్ ఫిగర్ కు ఎంత దూరం దాటుతుందన్న సంశయం స్టాక్ మార్కెట్ ను వణికేలా చేసింది. బీజేపీకి 250 కంటే తక్కువ సీట్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న సంశయాల కారణంగా మంగళవారం ఒక్కరోజులో భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ ఒక్కరోజులో 4390 పాయింట్లు నష్టపోతే.. నిఫ్టీ 1379 పాయింట్లు కోల్పోయింది. దీని పర్యవసానంగా రూ.31.07 లక్షల కోట్ల మదుపరుల సొమ్ము ఆవిరైంది.

బ్లూచిప్ షేర్లు సైతం నేల చూపులు చూశాయి. ఇక.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అయితే కనిష్ఠంగా 9.98 శాతం (అదానీ విల్మర్) నష్టపోతే.. గరిష్ఠంగా అదానీ పోర్ట్స్ 21.26 శాతం నష్టపోయిన పరిస్థితి. ఆ గ్రూపులోని అన్ని షేర్లు 15 - 21 శాతం మధ్యలో నష్టాన్ని నమోదు చేసిన పరిస్థితి. అయితే.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ కొలువు తీరుతుందని.. మోడీనే ప్రధానమంత్రి అవుతారన్న నమ్మకం బుధవారానికి కలిగింది. దీనికి తోడు.. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లినట్లుగా సాగిన తప్పుడు ప్రచారం మరింత కన్ఫ్యూజన్ కు గురయ్యేలా చేసింది.

అయితే.. ఇలాంటి ప్రచారానికి స్వయంగా చెక్ పెట్టిన చంద్రబాబు.. తాము ఎన్డీయేతోనే కంటిన్యూ అవుతామని.. మోడీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని.. కాంగ్రెస్ తమను సంప్రదిస్తున్న వార్తల్లో నిజం లేదన్న మాట స్టాక్ మార్కెట్ కు భారీ ఊరటగా మారిందని చెప్పాలి. ఈ రోజు (బుధవారం) ఉదయం ప్రారంభమైన ట్రేడింగ్ 9.30 గంటలకే సెన్సెక్స్ 529 పాయింట్ల లాభాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ 153 పాయింట్లతో రికవరీమోడ్ లోకి వెళ్లింది.

ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటల సమయానికి పరిస్థితి చూస్తే.. చాలావరకు రికవరీ అయ్యిందని చెప్పాలి. నిన్నటి దారుణ పతనంతో పోలిస్తే.. పరిస్థితి చాలావరకు చక్కబడినట్లుగా చెప్పాలి. బుధవారం ఒక్కరోజులో సెన్సెక్స్ 2381 పాయిట్లు పుంజుకొని 74460 పాయింట్ల వద్దకు చేరుకుంది. ఇక.. నిఫ్టీ విషయానికి వస్తే 22,113 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలు కాగా మధ్యాహ్నం మూడు గంటల వేళకు 22,633 పాయింట్ల వద్దకు చేరింది. మొత్తంగా రోజులో 745పాయింట్ల వద్ద రికవరీ అయిన పరిస్థితి. మంగళవారంతో నష్టపోయిన నిఫ్టీ పాయింట్లలో దాదాపు సగానికి పైగా కోలుకున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రేడింగ్ చేసే వారు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.