Begin typing your search above and press return to search.

ఫలితాల ప్రభావం.. రూ.35 లక్షల కోట్లు ఆవిరి

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత భారీ త్రోటుపాటుకు గురైంది స్టాక్ మార్కెట్.

By:  Tupaki Desk   |   4 Jun 2024 9:45 AM GMT
ఫలితాల ప్రభావం.. రూ.35 లక్షల కోట్లు ఆవిరి
X

మోడీ మేజిక్ విలువ ఎంతన్న విషయాన్ని స్టాక్ మార్కెట్ చెప్పకనే చెప్పేసింది. ఎగ్జిట్ పోల్స్ లో మోడీ అండ్ కో దూసుకెళతారని.. ఎన్డీయే కూటమికి సింఫుల్ గా 370 సీట్లను సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత భారీ త్రోటుపాటుకు గురైంది స్టాక్ మార్కెట్. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మోడీ సర్కారు కేంద్రంలో ఏర్పాటు చేయటానికి ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ.. బీజేపీకి సొంత బలం భారీగా తగ్గినట్లుగా వెల్లడైన ఫలితాలతో పరిస్థితి దారుణంగా తయారైంది.

ఎన్నికల ఫలితాలు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పుంజుకుందన్నట్లుగా వస్తున్న ఫలితాలు స్టాక్ మార్కెట్ ను దారుణంగా దెబ్బ తీశాయి. లోక్ సభలో మొత్తం 543 సీట్లకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన బలం 272 స్థానాలు. అయితే.. ఎన్డీయే కూటమి ఇప్పటివరకు 286 స్థానాల్ని సొంతం చేసుకుంది. అంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట. కానీ.. సమస్య మొత్తం ఎక్కడ ఉందంటే.. బీజేపీ తనకు తానుగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఆ పార్టీకి 243 స్థానాల్లోనే అధిక్యత ఉంది. అంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రుల సహకారం తప్పనిసరి.

గడిచిన పదేళ్లలో ఏ రోజు కూడా కేంద్రంలోని మోడీ సర్కారుకు అంకెలాట తెలీదు. కానీ.. ఇప్పుడు అసలుసిసలు అంకెలతో రాజకీయ క్రీడకు తెర లేవనుంది. ఇదే.. స్టాక్ మార్కెట్ తీవ్రమైన కుదుపునకు గురయ్యేలా చేసింది. ఈ పతనం మరికొంతకాలం కొనసాగే పరిస్థితి. కేంద్రంలో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి లుకలుకలు లేవని.. అందరూ మోడీకి కంకణబద్ధులుగా ఉంటారన్న నమ్మకం కలిగే వరకు స్టాక్ మార్కెట్ సజావుగా సాగే పరిస్థితి లేదని చెప్పాలి.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయానికి మదుపర్ల సొమ్ము దాదాపు రూ.35 లక్షల కోట్లు ఆవిరైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పటంతో రికార్డు స్థాయిలో భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ఒక రోజునష్టం మంగళవారం చోటు చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో రికార్డు స్థాయిలో సోమవారం ట్రేడింగ్ జరిగి.. లాభాలు మూట కట్టుకోగా.. తాజాగా సీన్ రివర్సు అయ్యింది.

మధ్యాహ్న సమయానికి (12.45 గంటల వేళకు) నిఫ్టీ 1466పాయింట్లు నష్టపోగా.. సెన్సెక్స్ 4514 పాయింట్లు పడిపోయింది. మొత్తంగా నిఫ్టీ 21,790కు చేరితే.. సెన్సెక్స్ 71,890 వద్ద ఉంది. స్థిరమైన ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరుతుందన్న నమ్మకం కలిగే వరకు స్టాక్ మార్కెట్ లో అనిశ్చితి నెలకొని ఉంటుంది. బేర్ తాండవటం సాగనుంది. ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వచ్చినా.. మిత్రుల మాటకు విలువ ఇవ్వటంతో పాటు.. వారు చెప్పింది వినాల్సిన పరిస్థితి ఎర్పడిందని చెప్పక తప్పదు.