Begin typing your search above and press return to search.

నాలుగేళ్ల క్రితం టూవీలర్ పోయింది.. రూ.22 వేల చలానా మాత్రం వచ్చింది

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి టూవీలర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 5:57 AM GMT
నాలుగేళ్ల క్రితం టూవీలర్ పోయింది.. రూ.22 వేల చలానా మాత్రం వచ్చింది
X

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి టూవీలర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసు స్టేషన్ లో దీనిపై కంప్లైంట్ ఇచ్చారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. తాజాగా సదరు టూవీలర్ మీద చలానాల మీద చలానాలు పడుతూ.. మొత్తంగా 22 వేల రూపాయిల చలానా బకాయి ఉన్నట్లుగా మెసేజ్ రావటంతో.. సదరు వాహన యజమాని పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు. షాకింగ్ ఫలితం తెర మీదకు వచ్చేసింది. అసలేం జరిగిందంటే..

న్యూబోయిన్ పల్లికి చెందిన వెంకట్ రెడ్డికి ఒక యాక్టివా ఉండేది. 2020 ఏప్రిల్ లో తన ఇంటి ముందు ఉంచి.. ఇంట్లోకి వెళ్లారు. కాసేపటి తర్వాత వచ్చి చూస్తే.. ఇంటి బయట ఉండాల్సిన యాక్టివా లేదు. దీంతో దానికోసం వెతికిన అతను.. చివరకు చేసేదేమీ లేక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే.. కొవిడ్ కావటం.. లాక్ డౌన్ తదితరాలతో ఆ విషయంపై మరింత ముందుకు వెళ్లలేకపోయాడు.

కట్ చేస్తే.. తాజాగా అతనికి 66 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా రూ.22 వేల ఫైన్ కట్టాలంటూ తాఖీదులు వచ్చాయి.దీంతో బిత్తరపోయిన సదరు వ్యక్తి.. పోలీసులను ఆశ్రయించారు. గతంలో తానిచ్చిన కంప్లైంట్ ను చూపించి.. తాజాగా తనకు వచ్చిన నోటీసులను చూపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ చలానాలను పరిశీలించి.. సదరు వాహనం ఏ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతుందో గమనించారు. రంగంలోకి దిగిన వారు సదరు యాక్టివా పాతబస్తీలో తిరుగుతుందన్న విషయాన్ని గుర్తించి.. నిఘా పెట్టారు. తాజాగా ఆ వాహనం దొరికేసింది. దీంతో సదరు వాహనదారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.