రాళ్ళతో రాజకీయం : జగన్ తో పాటు బాబు పవన్ !
ఏపీలో రాళ్ళతో రాజకీయం సాగుతోంది. సీరియస్ గా మొదలైన రాళ్ళ దాడి ఘటన కాస్తా కామెడీగా మారుతోందా అన్న చర్చ వస్తోంది.
By: Tupaki Desk | 15 April 2024 3:57 AM GMTఏపీలో రాళ్ళతో రాజకీయం సాగుతోంది. సీరియస్ గా మొదలైన రాళ్ళ దాడి ఘటన కాస్తా కామెడీగా మారుతోందా అన్న చర్చ వస్తోంది. జగన్ మీద విజయవాడలో శనివారం రాత్రి రాళ్ల దాడి జరిగి ఆయన ఎడమ కంటి మీద గాయం ఏర్పడింది. దాంతో అది జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది.
ఇది కోడి కత్తి డ్రామా మాదిరిగా వైసీపీ చేయించుకుందని టీడీపీ ఆరోపిస్తూంటే జగన్ కి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ వారే చేయించారు అని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే జగన్ మీద రాళ్ళ దాడి అన్నది ఈసీ స్థాయిలో కూడా సీరియస్ మ్యాటర్ గానే వెళ్ళింది.
ముఖ్యమంత్రి మీదనే రాళ్ళ దాడి జరగడం అన్నది అదీ ఎన్నికలు పీక్ స్టేజ్ లో ఉన్న వేళ జరగడం అంటే ఎంత పెంచాలో అంతలా పొలిటికల్ హీట్ పెంచేసింది. మరో వైపు చూస్తే జగన్ మీద రాళ్ళ దాడి జరిగింది ఇది మంచిది కాదు అంతా అనుకుంటూ ఖండిస్తున్న నేపధ్యంలో తెనాలి సభలో పాల్గొనేందుకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ మీద ఆగంతకుడు రాయితో దాడి చేశాడు అన్న వార్తలు వచ్చాయి.
ఇక విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాహనం మీద వెనక నుంచి ఎవరో ఆగంతకుడు రాయి విసిరారు అని మరో ప్రచారం సాగింది. ఇలా ఒక్క రోజు తేడాలో ముగ్గురు నేతల మీద రాళ్ళ దాడులు జరిగాయి అన్న వార్తలు అయితే సంచలనం రేకెత్తిస్తున్నాయి.
అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఎవరూ మరొకరిని చూడడం లేదు. శత్రువుల కంటే దారుణంగా చూస్తున్నారు. ఒకరి మీద ఒకరు కోపం పెంచుకుంటూ మాట్లాడుతున్నారు. పాతాళానికి తొక్కేస్తాను అని ఒక నేత అంటాడు. చెప్పు తీసి కొడతాను అని కూడా అంటారు.
వెంట పెట్టి మరీ కొడతామని ఇంట్లోకి వచ్చి కొడతామని కూడా నేతలు అంటున్నారు. దీని వల్ల అమాయకంగా ఉండే క్యాడర్ కి ఏమి తెలుసు. అంత కసి కూడా వారు మెదళ్ళల్లోకి ఎక్కించేస్తున్నారు. పరుషమైన భాష వాడుతున్నారు. గతంలో ఒక నాయకుడు మాట్లాడితే ఆయన ప్రసంగం మొత్తం మీద విధానాల మీదనే విమర్శలు ఉండేవి.
అంతే తప్ప మరే విధంగా దూషణ భూషణలు ఉండేవి కావు. మీ పాలనలో ఈ పని చేయలేదు, మీరు ఈ మాట చెప్పి తప్పారు అని సున్నితంగానే విమర్శలు చేసేవారు. అందులో చలోక్తులు ఉండేవి, హాస్యాన్ని వ్యంగ్యాన్ని జోడించి విమర్శలు చేసేవారు. ఇపుడు రాజకీయాల మీద అవగాహన లేని వారు కూడా నేతల రూపంలో వేదికలు ఎక్కుతున్నారు.
వారు మాట్లాడే భాష కూడా ఏమీ బాగుండడం లేదు. ప్రజాస్వామ్యంలో కూడని వాడని భాషను వాడుతున్నారు. కసిని పెంచేసి పోతున్నారు. దాంతో అవతల పక్షం నాయకుడు అంటే శత్రువు అని విలన్ అని అనుకునే పరిస్థితి తెస్తున్నారు అందరూ నాయకులే ప్రజల కోసం సేవ చేయడానికే ఉన్నారు అని అనుకునేలా నేతలే వ్యవహరించడం లేదు.
ఓడిపోతే జైలుకే అంటున్నారు వీరే తీర్పు ఇచ్చేస్తునారు. చిప్ప కూడు పెట్టిస్తామని అంటున్నారు. కటకటాల వెనక్కి నెడుతామని అంటున్నారు. ఇవన్నీ మాటలకు బాగానే ఉంటాయి అవి జరుగుతాయా కానీ జనాలను ఎట్రాక్ట్ చేయడానికి వాడుతూంటారు. కానీ అమాయకపు కార్యకర్తలు అవే నిజాలుగా భావించి దాడులకు తెగబడితే దానికి బాధ్యులు ఎవరు అన్నది చర్చ గా ఉంది.
ఈసీ ఒక వైపు నిఘా పెడుతున్నా కూడా దారుణమైన విమర్శలు ఆగడంలేదు. అలాంటిది నిరంతరం విమర్శలు దారుణంగా చేసుకుంటూ ఒకరి మీద ఒకరికి గౌరవం లేకుండా చేసుకుంటూ కార్యకర్తల మధ్య యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు. ఇక కార్యకర్తల సంగతి పక్కన పెడితే సంఘ వ్యతిరేక శక్తులకు ఇలాంటివి ఆలవాలంగా మారుతున్నాయి.
వారు ఎపుడూ అవకాశాల కోసం చూస్తారు. అశాంతిగా సమాజాన్ని మారుస్తే కనుక అది చివరికి ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతుంది. ఇప్పటికైనా నాయకులు తమ భాషను మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయాలి. లేకపోతే రాళ్ళ దాడులే కాదు ఇంకా పెద్ద ప్రమాదాలు అయినా జరుగుతాయని ప్రజాస్వామ్య ప్రియులు హితవు చెబుతున్నారు.