వింత శబ్ధాలతో శాస్త్రవేత్తలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ లైనర్
ఈ శబ్దాలను నాసా శాస్త్రవేత్తలకు వినిపించారు. ఈ శబ్దాలు ఎందుకు? ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది అర్థం కాని పరిస్థితి.
By: Tupaki Desk | 3 Sep 2024 6:30 AM GMTఇప్పటికి ఉన్న సమస్యలు సరిపోవన్నట్లుగా నాసా శాస్త్రవేత్తల నెత్తిన మరో భారాన్ని పడేసింది స్టార్ లైనర్. దీని కారణంగా 8 రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉండి భూమి మీదకు వచ్చేయాల్సిన సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి వచ్చే ఫిబ్రవరి వరకు అక్కడే ఉండిపోయేలా చేసిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యలతో శాస్త్రవేత్తలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ లైనర్ వ్యోమనౌక.. ఇప్పుడు మరో పెద్ద సమస్యను గుర్తించారు. బయట నుంచి ఎవరో తడుముతున్న్టట్లుగా శబ్దాలు రావటంతో.. అవెందుకు వస్తున్నాయన్నది ఇప్పుడు అంతబట్టని సమస్యగా మారింది.
ఈ శబ్దాలను నాసా శాస్త్రవేత్తలకు వినిపించారు. ఈ శబ్దాలు ఎందుకు? ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది అర్థం కాని పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూర్తిస్థాయి పరిశీలన జరుపుతున్నట్లుగా నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావమా? లేదంటే ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వస్తున్నాయన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. భారత సంతతికి చెందిన వ్యోమోగామి సునీతా విలియమ్స్ తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ ఐదున మొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవటం తెలిసిందే.
అక్కడే ఎనిమిది రోజులు ఉండి భూమి మీదకు తిరిగి వచ్చేయాల్సి ఉంది. అయితే.. షెడ్యూల్ కు భిన్నంగా.. ముందుగా వేసుకున్న లెక్కలకు భిన్నంగా స్టార్ లైనర్ లో థ్రస్టర్ వైఫల్యం.. హీలియం లీకేజీ లాంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో వారు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయే పరిస్థితి. వీరిద్దరిని మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకు రావాలని నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్ లైనర్ ను మాత్రం ఈ నెల ఆరున తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి వేళలోనే.. ఈ వింత శబ్దాల వ్యవహారం తెర మీదకు వచ్చింది. దీంతో.. ఈ సమస్య మూలాల్ని గుర్తించేందుకు నాసా శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.