హవాయి లో దోమల తో వింత ప్రయత్నం..
అడవిలో ఉన్న ఆడదోమలు కోసం వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమలను హెలికాప్టర్ ద్వారా విడిచి పెడుతున్నారు.
By: Tupaki Desk | 22 Jun 2024 3:30 PM GMTముదురు రంగులతో ఆకర్షణీయంగా హవాయి దీవుల్లో సందడి చేస్తూ టూరిస్ట్ లను ఆకర్షించే హనీక్రీపర్ పక్షులు కనుమరుగైపోతున్నాయి.
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఇలా చెట్లు ,జంతువులు అంతరించిపోవడం వల్ల నేచర్ పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే పర్యావరణ రక్షణ కోసం ఎన్నో దేశాలు కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి. అయితే పర్యావరణ సంరక్షణ కోసం కొన్ని దేశాలు ఆచరిస్తున్న పద్ధతులు చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. అటువంటి వింతే హవాయి రాష్ట్రంలో చోటు చేసుకుంది.
అంతరించిపోతున్న పక్షుల పరిరక్షణ కోసం అమెరికాలో ఉన్న హవాయి రాష్ట్రం ఆచరిస్తున్న వినూత్న చర్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అరుదైన పక్షులను కాపాడడం కోసం వీరు బ్యాక్టీరియాతో కూడిన దోమలను కొన్ని లక్షల సంఖ్యలో విడిచిపెట్టారు. పక్షులకి దోమలకి మధ్య లింక్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..
హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షిజాతులలో హనీక్రీపర్స్ కూడా ఉన్నాయి. అయితే హవాయి దీవులో ఎన్నో అరుదైన పక్షులు మలేరియా కారణంగా అంతరించిపోతున్నాయి. దోమల ద్వారా సంక్రమిస్తున్న ఏవియన్ మలేరియా కారణంగా ఇప్పటికే 33 జాతుల హనీక్రీపర్ పక్షులు అంతరించడంతోపాటు మరికొన్ని జాతులు ముప్పులో ఉన్నాయి.
వ్యాధిని నిరోధించడానికి సహజమైనటువంటి రోగనిరోధక శక్తి లేకపోవడం వల్లే స్థానిక పక్షులు దోమకాటుకు బలైపోతున్నాయి. ఈ వ్యాధికి కారణమయ్యే దోమల కుట్టడం వల్ల 90 శాతం చనిపోయే అవకాశం ఉంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి నుంచి పక్షులను కాపాడడానికి హవాయి రాష్ట్రం వినూత్నమైన పద్ధతి అవలంబిస్తోంది.
అడవిలో ఉన్న ఆడదోమలు కోసం వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమలను హెలికాప్టర్ ద్వారా విడిచి పెడుతున్నారు.
ఇన్‌కాంపాటబుల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్ (IIT)గా పిలువబడే సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ బ్యాక్టీరియా ఉన్న మగ దోమలతో కలిసిన ఆడ దోమలు గుడ్లు పెట్టే శక్తిని కోల్పోతాయి. దీనివల్ల క్రమంగా ఆ దోమల జాతి సంఖ్య తగ్గుతుంది. ఇలా మలేరియా కారణంగా చనిపోయే పక్షుల సంఖ్యను భారీగా తగ్గించడానికి ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.హవాయి రాష్ట్ర ప్రభుత్వం యూఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ సహాయంతో ఈ ప్రాజెక్టు ను చేపట్టింది. ఈ పద్ధతినే చైనా, మెక్సికో ప్రభుత్వాలు కూడా తమ దేశంలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగించాయి.