Begin typing your search above and press return to search.

అత్యంత దారుణం... బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు!

ఈ క్రమంలో తాజాగా ఏడాదిన్నర బాలుడు వీధి కుక్కలకు బలైపోయాడు!

By:  Tupaki Desk   |   17 July 2024 4:50 AM GMT
అత్యంత దారుణం... బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు!
X

విశ్వనగరం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో పిల్లలు, మహిళలు గాయాలపాలవ్వడం, మృత్యువాతపడటం సర్వసాధారణమైపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, అధినేతలు మారినా వీధి కుక్కలతో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని ప్రజానికం వాపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏడాదిన్నర బాలుడు వీధి కుక్కలకు బలైపోయాడు!

అవును... హైదరాబాద్ శివారులో దారుణం చోటు చేసుకుంది. జగవహర్ నగర్ లో వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో బాలుడిపైకి దూసుకొచ్చిన కుక్కలు... జుట్టు, బట్టలు పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో జుట్టూ, చర్మం ఊడి పడిపోగా.. మెదడులో కొంత భాగం కూడా బయటపడిందని అంటున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లాకు చెందిన భారత్ - లక్ష్మీ దంపతులకు విహాన్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రతుకుదెరువుకోసం వాళ్లు హైదరాబాద్ కి వచ్చి.. జవహర్ నగర్ లో నివాసం ఉంటుంన్న లక్ష్మీ సోదరుడి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే... మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో... వీధి కుక్కలు గుంపులుగా వచ్చి ఒక్కసారిగా దాడి చేసి, ఈడ్చుకెళ్లిపోయాయి.

ఈ సమయంలో కుక్కల గుంపును చూసిన స్థానికుడు ఒకరు అనుమానం వచ్చి వాటి దగ్గరకు వెళ్లి చుడగా... వాటి మధ్య తీవ్రగాయాలతో పడిఉన్న విహాన్ కనిపించాడు. ఆ సమయంలో విహాన్ ఒళ్లంతా రక్తం కారుతూ ఉండగా.. పక్కనే మెదడులో కొంత భాగం కూడా కనిపించిందని చెబుతున్నారు. దీంతో.. వెంటనే కుక్కలను తరిమికొట్టిన అతడు.. బాలుడి తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే... అక్కడ నుంచి గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగానికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడి పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో విహాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు! దీంతో... బాలుడి తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక్కడ వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు.