Begin typing your search above and press return to search.

జగనే ఆదర్శం మమతకు నో ఆప్షన్.. బెంగాల్‌లో దిశాలాంటి బిల్లు అమల్లోకి..!

అయితే.. మరోసారి ఈ ఘటనలు వెలుగుచూడకూడదని బెంగాల్ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చింది. ఈ మేరకు సంచలన నిర్ణయాలు తీసుకుంది.

By:  Tupaki Desk   |   3 Sep 2024 10:55 AM GMT
జగనే ఆదర్శం మమతకు నో ఆప్షన్.. బెంగాల్‌లో దిశాలాంటి బిల్లు అమల్లోకి..!
X

దేశంలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. పట్టణాల నుంచి గ్రామాల వరకు మహిళలకు రక్షణ లేకుండాపోయింది. చిన్న పిల్లల నుంచి వృద్ధ మహిళలను సైతం వదలకుండా ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తమ కామంతో ఆడవారిని ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారు.

గతంలో ఓ నిర్భయ, ఓ దిశ, ఓ అభయ ఘటనలు చూశాం. అవి ఇంకా మరువక ముందే ఇటీవల కోల్‌కతాలోని మెడికోపై లైంగికదాడి జరిగింది. ఈ ఘటన సైతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత నెల 9న జూనియర్ డాక్టర్‌పై ఈ దారుణం జరిగింది. దీనిపై రోజురోజుకూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఐఎంఏ డాక్టర్లు, మెడికోలు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. దేశంలో సరైన చట్టాలు.. కఠిన శిక్షలు లేకపోవడం వల్లే మృగాళ్లు ఇలా రెచ్చిపోతున్నారని చాలా వరకు మహిళలు అభిప్రాయం వెల్లడించారు. ఈ ఘటనలో మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఆ వేడి ఇంకా చల్లారలేదు.

అయితే.. మరోసారి ఈ ఘటనలు వెలుగుచూడకూడదని బెంగాల్ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చింది. ఈ మేరకు సంచలన నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అమల్లోకి తెచ్చిన దిశ తరహా బిల్లును ప్రవేశపెట్టింది. కొద్దిసేపటి క్రితమే అక్కడి అసెంబ్లీలో ఆ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం.. లైంగికదాడి ఘటనల్లో దోషిగా తేలిన వారికి మరణ శిక్ష విధించనున్నారు.

మహిళలపై లైంగిక దాడికి పాల్పడినా.. మహిళలను హత్య చేసిన ఘటన జరిగిన పది రోజుల్లోనే మరణశిక్ష అమలయ్యేలా ఈ బిల్లును రూపొందించారు. పెరోల్‌కు సైతం అవకాశం లేకుండా జీవిత ఖైదును విధించే వెసులుబాటు తెచ్చారు. ఈ బిల్లుకు అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాల సవరణ) 2024 అని నామకరణం చేశారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఆ వెంటనే అందరూ ఆమోదం తెలిపారు. అలాగే.. భారతీయ న్యాయ్ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం 2012లోని పలు సెక్షన్లకు కూడా మార్పులను సూచించారు.