ఒక్క రాజీనామాతో తెగే బంధమా ?
తెలుగు రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి వెళ్ళిన వారు తమ మాతృ సంస్థ పట్ల ఆ పార్టీ అధినాయకుల పట్ల ప్రేమ కనబరుస్తూండం అంతా గమనిస్తున్న విషయమే.
By: Tupaki Desk | 25 Jan 2025 9:30 PM GMTఎంత రాజకీయాలు అనుకున్నా కొన్ని బంధాలు గట్టిగానే ఉంటాయి. వారు ఎక్కడ ఉన్నా కూడా ఆ బంధాలు చెక్కుచెదరవు. తెలుగు రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి వెళ్ళిన వారు తమ మాతృ సంస్థ పట్ల ఆ పార్టీ అధినాయకుల పట్ల ప్రేమ కనబరుస్తూండం అంతా గమనిస్తున్న విషయమే.
ఈ విధంగా చూసుకుంటే రాజకీయాల కంటే ముందే తరాలుగా ఒకే కుటుంబంతో అవినాభావ బంధం పెనవేసుకున్న విజయసాయిరెడ్డి జగన్ తో అంత సులువుగా బంధం తెంచుకోగలరా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని సుదీర్ఘ ట్వీట్ చేసినా లేక రాజీనామా తరువాత ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో జగన్ మీద మంచిగా మాట్లాడినా ఇవన్నీ చూసినపుడు ఒక్కటే అనిపిస్తుంది ఆయన రాజకీయాలను పక్కన పెట్టవచ్చు కానీ రాగ బంధాలను మాత్రం పెట్టలేకపోవచ్చు అని.
ఇక విజయసాయిరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ శ్రేణులు అన్నీ షాక్ లోనే ఉన్నాయి. కానీ చిత్రమేంటి అంటే ఏ ఒక్కరూ కూడా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ట్వీట్ కానీ కామెంట్ కానీ చేయకపోవడం. అంటే మానసికంగా విజయసాయిరెడ్డిని వైసీపీలోనే పార్టీ మొత్తం ఉంచుకుంది అన్న మాట.
మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం నుంచి కూడా ఎవరూ ఘాటుగా ఈ విషయంలో స్పందించకపోవడం, ఇక జగన్ రియాక్షన్ ఏంటి అని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన వద్దు అని అన్నారని తాము అంతా అండగా ఉంటామని చెప్పారని విజయసాయిరెడ్డి బదులు ఇవ్వడం ఇవన్నీ చూస్తూంటే అటూ ఇటూ రాజకీయం కంటే అతీతమైన బంధాలు బలంగా పెనవేసుకుని ఉన్నాయని అర్థం అవుతోంది.
ఇక విజయసాయిరెడ్డి కంటే వైసీపీలో విశ్వాసపాత్రులైన నాయకుడు వేరొకరు లేరు ఆనాడు అన్న రాముడితో పాటు తమ్ముడు లక్ష్మణుడు పద్నాలుగేళ్ల పాటు వనవాసం చేశారు అన్నది పురాణ గాధ. మరి ఈ ఆధునిక యుగంలో జగన్ తో పాటుగా పదహారు నెలలు జైలులో ఉండి ఆయనతో పాటుగా అన్ని కష్టాలు అనుభవించిన వారు విజయసాయిరెడ్డి.
మరి ఇంతకంటే వైసీపీలో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు వేరొకరు ఉంటారని అనుకోలేరు. అందుకే జగన్ విజయసాయిరెడ్డిల మధ్య బంధం రాజకీయాలకు అతీతమైనది. కారణాలు పరిస్థితులు బలీయమైనవి. అవి ఎవరిని ఎవరు నుంచి అయినా దూరం చేయగలవు. అలా చూస్తే కనుక విజయసాయిరెడ్డి పరిస్థితుల ప్రభావంగానే వైసీపీకి దూరం అయ్యారు అనుకోవాలి.
అలాగే రాజకీయాలకు గుడ్ బై చెప్పారు అని భావించాలి. అంత మాత్రం చేత ఆయన వైసీపీకి చేటు తెస్తారని జగన్ తో రాజకీయ వైరం పెట్టుకుంటారు అని ఎవరూ అనుకోవడం లేదని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి జగన్ కి మంచి జరగాలని కూడా కోరుకున్నారు. దాంతో ఒక్క రాజీనామాతో ఈ బంధం తెగేదా అన్న చర్చ అయితే సాగుతోంది.
వైసీపీకి జగన్ కి ఆయన దూరం జరిగినా అది భౌతికంగా మాత్రమే తప్ప వేరొకటి కాదని కూడా వైసీపీ క్యాడర్ సమాధానం పడుతున్నారు. విజయసాయిరెడ్డి ఎప్పటికీ వైసీపీ వారే అని వారు సొంతం చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డిని బీజేపీలోకి పంపాలని ఆ పార్టీ అధినాయకత్వం ప్లాన్ వేసి ఇలా చేసింది అన్న వార్తల పట్ల కూడా ఎవరూ నమ్మడం లేదు.
ఎందుకంటే జగన్ విషయం తీసుకుంటే ఆయన ఇలాంటి వ్యూహాలు వేస్తారని కూడా అనుకోవడం లేదు అంటున్నారు. అదే సమయంలో ఆయన ఏది చేసినా డైరెక్ట్ గానే చేస్తారు అని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ద్వారా ఫ్రీ బర్డ్ అయ్యారని అంటున్నారు. అందువల్ల ఆయన రేపటి రోజు ఏ నిర్ణయం అయినా తీసుకునే వీలుంది అని అంటున్నారు.
అయితే ఆయన ఏమి చేసినా జగన్ కి ఎదురు నిలిచే రాజకీయం చేస్తారని మాత్రం వైసీపీ శ్రేణులు అనుకోవడం లేదు. మరి ఆయన మీద అంత నమ్మకం వైసీపీలో వ్యక్తం అవుతోంది. మొత్తానికి చూస్తే జగన్ విజయసాయిరెడ్డిల మధ్య బంధం బలీయమైనది అని అంతా అంటున్నారు. చూడాలి మరి కాలం పరిస్థితులు అంతకంటే బలీయమైనవి. అవి చేసే తమాషాలకు ఏ బంధాలు ఎలా అవుతాయో.