ప్రఖ్యాత అన్నా వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థిని గ్యాంగ్ రేప్
ఇంజనీరింగ్ చదివే విద్యార్థిని ఇద్దరు దుండగులు కలిసి బలత్కారానికి పాల్పడ్డారు.
By: Tupaki Desk | 26 Dec 2024 3:15 AM GMTతమిళనాడులో ప్రఖ్యాత అన్నా వర్సిటీ ప్రాంగణంలో ఒక విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చోటు చేసుకున్న వైనం పెను సంచలనంగా మారింది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థిని ఇద్దరు దుండగులు కలిసి బలత్కారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ దారుణం వెలుగు చూసింది. డిసెంబరు 23 రాత్రి జరిగిన ఈ వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం చూస్తే.. డిసెంబరు 23 రాత్రి బాధితురాలు.. ఆమె స్నేహితుడు కలిసి అన్నా వర్సిటీ క్యాంపస్ లో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి.. ఆమె స్నేహితుడ్ని దారుణంగా కొట్టి బయటకు తరిమేశారు. అనంతరం వారిద్దరు కలిసి ఆమెను దారుణంగా అత్యాచారం చేశారు. అదే సమయంలో ఆమె నగ్నంగా ఉన్న ఫోటోల్ని తమ సెల్ ఫోన్ తో తీసుకున్నారు.
ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయితే.. ఆమె వారి బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ కు బాధితురాలితో పాటు ఆమె స్నేహితుడు కూడా వెళ్లి.. పోలీసులకు జరిగింది మొత్తం వివరించారు. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడు రోడ్డు మీద బిర్యానీ అమ్ముతుంటాడని గుర్తించారు. పరారీలో ఉన్న మరొకరి కోసం నాలుగు ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యంలో సాల్టిన్ సర్కారుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అన్నది ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు నడిబొడ్డున ఉన్న అన్నా వర్సిటీలో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకోవటం సిగ్గు చేటుగా మాజీముఖ్యమంత్రి పళనిస్వామి దుయ్యబట్టారు. ఈ ఉదంతంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతాయని మండిపడ్డారు.