Begin typing your search above and press return to search.

ఐదున్నర నెలలకే పుట్టింది.. ఇప్పుడు అద్భుతాలు సృష్టించింది!

అవును... ఆరోగ్యం బాగున్నా, అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా స్కూలు ఎగ్గొట్టడానికి కొంతమంది పిల్లలు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 6:28 AM GMT
ఐదున్నర నెలలకే పుట్టింది.. ఇప్పుడు అద్భుతాలు సృష్టించింది!
X

ఐదున్నర నెలలకే అమ్మ కడుపులోనుంచి ఈ లోకంలోకి వచ్చేసింది. ఆ సమయంలో అవయువాలు పూర్తిగా రూపుదాల్చక సుమారు మూడున్నర సంవత్సరాల వరకూ ఒక గదిలోనే ఉండి చికిత్స తీసుకుంటూ ఉండిపోయింది. అయితే ఇప్పుడు పాఠశాల హాజరులో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎంతోమందికి ఆదర్శంగా మారింది!


అవును... ఆరోగ్యం బాగున్నా, అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా స్కూలు ఎగ్గొట్టడానికి కొంతమంది పిల్లలు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఇందులో ఒకరు కడుపునొప్పి అంటే, ఇంకొకరు నీరసంగా ఉందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అమ్మాయి మాత్రం స్కూలుకు హాజరయ్యే విషయంలో రికార్డ్స్ నెలకొల్పింది.

వివరాళ్లోకి వెళ్తే... పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కారు డ్రైవర్ మస్తాన్ వలీ... కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో 2017లో గర్భం దాల్చిన షీబా.. ఆయత్ ఇశ్రాయెల్ జిబ్రిల్ కు జన్మనిచ్చారు. అయితే పాప ఐదున్నర నెలలకే పుట్టేసింది, ఆ సమయంలో ఆమె బరువు 500 గ్రాములే ఉంది.

దీనికి తోడు ఆమె అవయువాలు పూర్తిగా రూపు దాల్చకపోవడం, శరీరమంతా వెంట్రుకలతో జన్మించింది. దీంతో తల్లితండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో వివిధ వైద్య పరికరాల సాయంతో ప్రత్యేక గదిలో మూడున్నరేళ్ల వయసు వరకూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. ఫలితంగా ఆమె తల్లితండ్రుల కష్టం ఫలించింది.

ఆమె ఆరోగ్యం కుదుటుపడింది. ఈ క్రమంలో ఆమె వయసు అయిదేళ్లు రావడంతో ఆమెను కేరళలోనే ఎల్.కే.జీలో జాయిన్ చేశారు. స్కూలు లో నిత్యం మాస్క్ ధరించి ఉంటు, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటూ, ఇతర విద్యార్థులకు దూరంగా కూర్చుంటూ ఉండేది ఆయత్. ఇప్పుడు ఆమె వయసు 7 ఏళ్లు. ఈ క్రమంలో... 2023-24లో 197 రోజులు క్లాస్ లు నిర్వహించగా అన్ని రోజులూ హాజరైంది.

ఇలా ఒక్కరోజు కూడా స్కూల్ మానకుండా వెళ్లినందుకు ఆమెకు ఇప్పటివరకూ అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (యూకే), ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె చోటు దక్కించుకుంది.