Begin typing your search above and press return to search.

భారత్ లో నిశబ్ద అంటువ్యాధి... విద్యార్థుల ప్రాణాలే దాని టార్గెట్?

భారతదేశ భవిష్యత్తు అయిన యువతకు ఇప్పుడు ఓ నిశబ్ధ అంటువ్యాధి పెను ప్రమాదంగా మారిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Nov 2024 4:22 AM GMT
భారత్  లో నిశబ్ద అంటువ్యాధి... విద్యార్థుల ప్రాణాలే దాని టార్గెట్?
X

భారతదేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబండింది. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలదొక్కుకుంది. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. టాప్ జీడీపీ దేశాల్లో చేరాలనే లక్ష్యంతో ఉంది. అయితే... భారతదేశ భవిష్యత్తు అయిన యువతకు ఇప్పుడు ఓ నిశబ్ధ అంటువ్యాధి పెను ప్రమాదంగా మారిందని అంటున్నారు.

అవును... ఐఐటీ, ఎనైటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలు.. ఇప్పుడు భారతదేశ భవిష్యత్తు అయిన యువత విషయంలో ప్రెజర్ కుక్కర్ లుగా మారాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఉన్నత విద్యాసంస్థల్లో 2019, 2023 మధ్య 98 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

వీటిలో అత్యధికంగా 39 అ మరణాలు ఐఐటీల్లో జరగడం గమనార్హం. వీటిలోనూ ఐఐటీ మద్రాసులో ఎక్కువ నమోదయ్యాయని అంటున్నారు. దీనికి కారణం... తీవ్ర ఒత్తిడి అని చెబుతున్నారు నిపుణులు. టాప్ 15 ఐఐటీల్లోని 1,207 సీట్లకోసం 2,00,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఏటా పోటీ పడుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇటీవల ఐఐటీ విద్యార్థి సంస్థలు నిర్వహించిన అంతర్గత సర్వేలలో... ఈ ఇనిస్టిట్యూట్ లలో సుమారు 61శాతం మంది విద్యార్థుల ఆత్మహత్యలకు అకడమిక్ ఒత్తిడే ప్రధాన కారణం అని తేలిందని అంటున్నారు. దీనికి తోడు సరైన ఉద్యోగ నియామకాలు లేకపోవడం కూడా ఈ ఒత్తిడిని మరింత పెంచుతుందని తేలిందని అంటున్న్నారు.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్.సీ.ఆర్.బీ) సమర్పించిన డేటా లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ మొదలైంది. 2013లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6,654 గా ఉండగా.. 2022లో ఆ సంఖ్య 13,044కి పెరిగింది. వీరి సంఖ్య కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో అధికంగా ఉందని అంటున్నారు.

అలాగని ఈ సమస్య పూర్తిగా విద్యాసంస్థలకే పరిమితం కాలేదు. ఈ సంక్షోభంలో కుటుంబ ఒత్తిడి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా భారతీయ కుటుంబాల్లోని చాలా మంది తల్లితండ్రులు.. వారి వారి కుటుంబాల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలను మోసేవారిగా పిల్లలను చూస్తుండటం కూడా దీనికి ఒక కారణం అని అంటున్నారు.

వీటికి తోడు ఆర్థికపరమైన అంశాలు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు.. తమ విద్యకు నిధులు సమకూర్చడానికి వారి కుటుంబాలు తీసుకున్న భారీ రుణాల అదనపు భారాన్ని కూడా క్యారీ చేస్తుండటం ఈ నిర్ణయాలకు మరో కారణం అని చెబుతున్నారు.

ఈ విషయంలో విద్యాసంస్థలతో పాటు తల్లితండ్రులు కూడా విద్యార్థులకు బాసటగా నిలవాలని కోరుతున్నారు. ప్రధానంగా విద్యాసంస్థల్లో ఎక్స్ పర్ట్స్ నుంచి కౌన్సిలింగ్ ఇప్పించాలాని.. దీనితో పాటు ఇంట్లో తల్లి తండ్రుల నుంచి కౌన్సిలింగ్ కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు. అలాకానిపక్షంలో.. కంటికి కనిపించిన ఈ ఒత్తిడి అనే మహమ్మారి ఆత్మహత్యల రూపంలో విద్యార్థుల జీవితాలను చిదిమేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు!