కెనడాకు మనోళ్లు వెళ్లటం తగ్గిస్తే.. ఆ దేశానికి జరిగే నష్టం ఎంతంటే?
దీనికి సంబంధించిన లెక్కను తాజాగా ఢిల్లీకి చెందిన మేధా సంస్థ అయిన ఇమేజ్ ఇండియా విడుదల చేసింది.
By: Tupaki Desk | 17 Oct 2023 4:40 AM GMTస్వేచ్చాయుత దేశం పేరుతో అతివాద శక్తుల్ని పెంచి పోషించిన దేశాలు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్ని కావు. కెనడాలో పెరిగిన ఖలిస్థానీ వేర్పాటువాదులకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వైనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన ఖలిస్థానీ వేర్పాటువాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో హత్య చేసిన ఉదంతంలో.. ఇదంతా భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రగిలిన దౌత్య సంబంధాలు ఆ దేశం మీద ఎంత ప్రభావాన్ని చూపుతాయన్న చర్చ షురూ అయ్యింది.
దీనికి సంబంధించిన లెక్కను తాజాగా ఢిల్లీకి చెందిన మేధా సంస్థ అయిన ఇమేజ్ ఇండియా విడుదల చేసింది. గడిచిన కొన్నేళ్లుగా కెనడాకు భారత విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇటీవల మరింత ఎక్కువైంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాకు వెళ్లే విద్యార్థుల్లో కనీస స్థాయిలో చూస్తే.. ఐదు శాతం వరకు తగ్గే వీలుందన్న అంచనా వేస్తున్నారు. ఒకవేళ.. ఈ లెక్కే నిజమైనా ఆ దేశానికి జరిగే ఆర్థిక నష్టం దగ్గర దగ్గర రూ.73 కోట్ల డాలర్ల మేర నష్టం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
కెనడాలో ఉన్నత విద్య కోసం ఆ దేశంలోని విద్యా సంస్థలు ప్రతి ఏడాది దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులకు ఆడ్మిషన్లు ఇస్తున్నాయి. కెనడాలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువ. గత ఏడాది కెనడాకు వెళ్లేందుకు 2.25 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు లభించాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే.. కెనడాలో ఉన్న అవకాశాలు.. వసతుల నేపథ్యంలో అక్కడ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
ఉన్నత విద్య పూర్తి అయిన తర్వాత కెనడాలో ఏడాది నుంచి మూడేళ్ల పాటు పని చేసే వెసులుబాటు ఉంది. అందుకే.. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కెనడాకు వెళ్లేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జనవరిలో వెళ్లే ఆడ్మిషన్ల మీద ప్రభావం పడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో భారతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లే ఆప్షన్ విషయంలో పునరాలోచనలో పడే వీలుందన్న మాట వినిపిస్తోంది.
ఒక అంచనా ప్రకారం జనవరిలో భారత్ నుంచి కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య దగ్గర దగ్గర 66వేలవరకు ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 5 శాతం తగ్గినా.. కెనడా ఆర్థికం మీద పెద్ద ప్రభావమే పడుతుందన్నది తాజా లెక్క. కెనడాలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఒక్కో భారతీయ విద్యార్థి పెట్టే ఖర్చు దగ్గర దగ్గర 16వేల డాలర్లు ఉంటుంది. రెండేళ్ల విద్యాభ్యాసం.. బస.. ల్యాప్ టాప్ తో సహా ఇతర అంశాల్ని లెక్కలోకి తీసుకుంటే.. 69 వేల డాలర్ల వరకు అవుతుంది.
ఈ లెక్కన మొత్తం విద్యార్థుల్లో 5 శాతం విద్యార్థులు అంటే.. 3300 మంది కెనడాకు వెళ్లే ఆప్షన్ ను వదిలేసుకుంటే.. ఆ దేశానికి జరిగే నష్టం దగ్గర దగ్గర 23 కోట్ల డాలర్లుగా లెక్క వేస్తున్నారు. జనవరి తర్వాత జరిగే మే.. సెప్టెంబరులో జరిగే ఆడ్మిషన్లకు ఐదు శాతం చొప్పున ఆడ్మిషన్లు తగ్గితే.. ఏడాదికి 69 కోట్ల డాలర్ల మేర కెనడా ఆదాయానికి గండి పడే వీలుందని చెబుతున్నారు. విద్యార్థుల ఆడ్మిషన్లు తగ్గితే.. భారత్ లోని కెనడా హైకమిషన్ సైతం వీసా ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో 30 లక్షల డాలర్లు కోల్పోతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. భారత విద్యార్థులు కెనడాకు చదువుకోవటానికి వెళ్లే విషయంలో ఆలోచనలో పడిన పక్షంలో జరిగే నష్టం ఇంత ఎక్కువని చెబుతున్నారు.
భారతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లే విషయంలో వెనక్కి తగ్గితే.. అది కూడా ఐదు శాతమైనా నేరుగా పడే ఆదాయ గండి మాత్రమే కాదు.. కెనడాలో చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి పార్ట్ టైం రూపంలో ఆదరవుగా నిలిచే భారత విద్యార్థుల భరోసా తగ్గుతుంది. దీంతో.. వారు అధిక జీతాలు ఇచ్చి పని వారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. వ్యాపార వర్గాల మీద ఖర్చు పోటు తప్పదు. మొత్తంగా. భారత విద్యార్థులు కెనడాకు వెళ్లటం తగ్గిస్తే.. ఆ దేశ విద్యా రంగంతో పాటు.. ఆదేశ ఆర్థిక రంగానికి సైతం నష్టాలు ఎక్కువన్న విషయాన్ని ఆ దేశం కూడా అర్థం చేసుకుంటుందని చెబుతున్నారు.