మే రెండో వారంలో స్టూడెంట్ వీసా స్లాట్లు విడుదల
తాజాగా ఈ సంఖ్య 2.68 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు.
By: Tupaki Desk | 3 May 2024 4:01 AM GMTగడిచిన కొద్ది రోజులుగా భారత దేశ విద్యార్థులు.. అందునా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్న అమెరికా స్టూడెంట్ వీసా స్లాట్లకు సంబంధించిన కీలక సమాచారం వెల్లడైంది. అమెరికాలో ఉన్నత విద్యాభాస్యం చేసేందుకు వీలుగా ఆ దేశ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏడాదికి రెండు దఫాలుగా విద్యార్థుల వీసా స్లాట్లను విడుదల చేసే అమెరికా.. ఈ నెల (మే) రెండో వారంలో విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేయనుంది. ఆగస్టు రెండో వారం వరకు ఈ స్లాట్లు అందుబాటులో ఉండనున్నాయి.
అమెరికాలో ఫాల్ సీజన్ కు సంబంధించిన సెమిస్టర్ ఆగస్టు - సెప్టెంబరు మధ్య ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వీసా స్లాట్లలో మొదటి విడత ఈ నెల రెండో వారంలో విడుదల కానున్నాయి. దేశంలోని పలు నగరాల్లో అమెరికన్ కాన్సులేట్లు ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్.. కోల్ కతా.. చెన్నై.. ముంబయి కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థులకు సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
2023లో రికార్డు స్థాయిలో 11 లక్షల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను భారతీయులకు అమెరికా జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు డిమాండ్ ఉంది. అయితే.. భారతీయుల్లో అత్యధికులు అమెరికాలో విద్యను అభ్యసించాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. స్టెమ్ కోర్సులతో పాటు పలు వినూత్న కోర్సులపైనా భారతీయ విద్యార్థులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
ఇంజినీరింగ్ లో ఎలక్ట్రికల్.. మెకానికల్.. మైక్రో ఇంజినీరింగ్ తో పాటు కంప్యూటర్ కోర్సులైన ఏఐ.. రోబోటిక్స్ లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. ఇటీవల కాలంలో సైకాలజీ సబ్జెక్టులపైనా మొగ్గు చూపుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా అమెరికాలో చదువుకునే విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తాజాగా ఈ సంఖ్య 2.68 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. అమెరికాలో చదువుకునే ప్రతి పది లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో 25 శాతం మంది విద్యార్థులు భారతీయులే కావటం గమనార్హం. 2023లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 63 శాతం పెరిగితే.. అండర్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య 16 శాతానికి పెరిగినట్లుగా చెబుతున్నారు.