Begin typing your search above and press return to search.

వైవీ సుబ్బారెడ్డి సవాలు.. లోకేశ్ ప్రతిసవాల్.. ఉత్తుత్తి రాజకీయమేనా?

సుబ్బారెడ్డి విసిరిన సవాలుపై మంత్రి నారా లోకేశ్ రియాక్టు అయ్యారు. తానిప్పుడు తిరుపతిలోనే ఉన్నానని.. తాను సిద్ధమని.. సుబ్బారెడ్డి సిద్దమా?

By:  Tupaki Desk   |   20 Sep 2024 4:02 AM GMT
వైవీ సుబ్బారెడ్డి సవాలు.. లోకేశ్ ప్రతిసవాల్.. ఉత్తుత్తి రాజకీయమేనా?
X

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే ఆవునెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ వచ్చిన ఆరోపణలపై వైసీపీ నేత.. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వంలో టీటీడీలో చక్రం తిప్పిన ఆయన.. తాజా ఆరోపణలపై విరుచుకుపడ్డారు. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ ఇలాంటి మాటలు మాట్లాడరన్న ఆయన.. అలాంటి ఆరోపణలు చేసిన చంద్రబాబుకు తీవ్రమైన సవాలు విసిరారు. తిరుమల పవిత్రను.. వందల కోట్ల హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బ తీసి పెద్ద పాపమే చేశాడన్న ఆయన.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయన్నారు.

రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా వెనుకాడరన్న సుబ్బారెడ్డి.. ‘‘చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ విషయం నిరూపితమైంది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదంపై ఎలాంటి అవకతవకలు జరగలేదు. నేను.. నా కుటుంబం ఆ దేవుడి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. మరి.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా లోకేశ్ లు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణానికి సిద్ధమా?’’ అని ప్రశ్నించారు.

ఇదే అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటల్ని చంద్రబాబు మాట్లాడారన్న ఆయన.. హిందువుల మనోభావాల్ని చంద్రబాబు కించపర్చారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే హిందూయేతరుడైన కరీముల్లా షరీఫ్ ను విజిలెన్స్ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. కరీముల్లా తో చంద్రబాబు తనకు కావాల్సినట్లుగా రిపోర్టు రాయించుకున్నారన్న ఆయన.. ‘‘జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేసిన వారంతా సర్వనాశనం అవుతారు. లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తే సర్వనాశనం అవుతారు’’ అంటూ మండిపడ్డారు.

సుబ్బారెడ్డి విసిరిన సవాలుపై మంత్రి నారా లోకేశ్ రియాక్టు అయ్యారు. తానిప్పుడు తిరుపతిలోనే ఉన్నానని.. తాను సిద్ధమని.. సుబ్బారెడ్డి సిద్దమా? అని ప్రశ్నించటంతో పాటు.. ‘ఆయన్ను రమ్మనండి’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సుబ్బారెడ్డి సవాలుకు లోకేశ్ రెఢీ అన్న నేపథ్యంలో.. ఇప్పుడు అడుగు ముందుకు వేయాల్సింది సుబ్బారెడ్డినే అన్న మాట వినిపిస్తోంది. లోకేశ్ రియాక్షన్ కు సుబ్బారెడ్డి ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ప్రశ్న.