Begin typing your search above and press return to search.

విశాఖ బరిలో ప్రముఖ నిర్మాత!

ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌ లో సీనియర్‌ నేతలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి ఉద్యుక్తులవుతున్నారు.

By:  Tupaki Desk   |   19 Jan 2024 4:47 AM GMT
విశాఖ బరిలో ప్రముఖ నిర్మాత!
X

ఆంధ్రప్రదేశ్‌ లో తాము కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకునే పనిలో ఉంది.. కాంగ్రెస్‌ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌ కు సరిహద్దు రాష్ట్రాలయిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో ఏపీలో కూడా అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలను అప్పగించింది.


ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌ లో సీనియర్‌ నేతలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి రావడంతో అవే హామీలతో ఆంధ్రాలోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము పోటీ చేసే నియోజకవర్గాలపైన కూడా కీలక నేతలు కర్చీప్‌ వేసేస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. గతంలో 1996, 1998 ఎన్నికల్లో సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా విజయం సాధించారు.1999 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. రెండుసార్లు లోక్‌ సభా ఎంపీగా, మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా చక్రం తిప్పారు. కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేశారు.

2012లో నెల్లూరు లోక్‌ సభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సుబ్బరామిరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

2020లో సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారని సమాచారం. ఆయనకు విశాఖ అంటే చాలా మక్కువ. చాలాసార్లు విశాఖ సముద్ర తీరంలో భారీ ఎత్తున మహాశివరాత్రి వేడుకలను నిర్వహించారు. పలు యజ్ఞాలు, యాగాలు సైతం చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున విశాఖ నుంచి బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే సుబ్బరామిరెడ్డి విశాఖపట్నంలో పర్యటించి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. గతంలో రెండుసార్లు విశాఖ ఎంపీగా పనిచేసి ఉండటంతో ఇక్కడ ఆయనకు పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారని.. వారంతా సుబ్బరామిరెడ్డి రాకను స్వాగతిస్తున్నారని టాక్‌.

కాగా సుబ్బరామిరెడ్డి ప్రముఖ నిర్మాతగా కూడా ఉన్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో స్టేట్‌ రౌడీతోపాటు ఇతర హీరోలతోనూ పలు చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన భగవద్గీత, స్వామి వివేకానంద చిత్రాలకు జాతీయ అవార్డులు లభించాయి.