Begin typing your search above and press return to search.

బీజేపీ ఒక టైటానిక్ షిప్...ఆయనే కెప్టెన్ !

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు గాలి వీచడం మీద కూడా స్వామి స్పందిస్తూ బీజేపీకి ఈ సమయంలో సరైన కెప్టెన్ ఎవరు అంటే మోడీయే అని జవాబు చెప్పారు.

By:  Tupaki Desk   |   17 July 2024 6:30 AM GMT
బీజేపీ ఒక  టైటానిక్ షిప్...ఆయనే కెప్టెన్ !
X

బీజేపీకి ఎదురు దెబ్బలు వరసబెట్టి తగులుతున్నాయి. మోడీ చరిష్మా అంటూ ఇన్నాళ్ళు ఘన విజయాలు పార్టీ నమోదు చేసుకుంటే ఎవరికీ పెద్దగా మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఇపుడు వారికి భలే చాన్స్ వచ్చేసింది. బీజేపీలో మోడీ నాయకత్వం మీద విమర్శలు విసుర్లు ఒక్కటేమిటి అన్నీ అలా వచ్చి పడుతున్నాయి.

ఈ విషయంలో అందరి కంటే ముందు ఉండే ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అయితే తాజాగా బీజేపీ తాజా పరిస్థితి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలే చేశారు. బీజేపీ ఇపుడు టైటానిక్ షిప్ మాదిరిగా ఉంది. ఎపుడు మునుగుతుందో తెలియదు అని హాట్ కామెంట్స్ చేశారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు గాలి వీచడం మీద కూడా స్వామి స్పందిస్తూ బీజేపీకి ఈ సమయంలో సరైన కెప్టెన్ ఎవరు అంటే మోడీయే అని జవాబు చెప్పారు. అయితే అది సెటైరికల్ గా చెప్పారు. మోడీ నాయకత్వం వహిస్తే చాలు బీజేపీ ఒక టైటానిక్ షిప్ లా చాలా తొందరగా మునిగిపోతుంది అని స్వామి ఎద్దేవా చేస్తున్నారు.

ఈ సమయంలో బీజేపీకి నాయకత్వం వహించడానికి మోడీ తప్ప మరెవరికీ సాధ్యం కాదని ఆన్నారు. ఎందుకంటే ఆయన ఉత్తమమైన వారు బెస్ట్ కెప్టెన్ అని కూడా అంటున్నారు. బీజేపీ అన్న పార్టీ భవిష్యత్తులో కనిపించకుండా శాశ్వతంగా మునిగిపోవాలంటే మోడీని మించిన వారు ఎవరూ లేరని అందుకే ఆయన తప్ప ఎవరూ కూడా కెప్టెన్ గా ఉండకూడదు అని స్వామి స్పష్టంగా చెబుతునారు.

బీజేపీ షిప్ బీటలు వారింది అని చెప్పడానికే ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు. దాంతో బీజేపీ జాతకం తెలిసిపోతోందని ఇక టైటానిక్ షిప్ లా మెల్లగా మునుగుతూ బీజేపీ ఆనవాళ్ళు కనిపించనంతగా పోవడం ఖాయమని ఆయన జోస్యం చెబుతున్నారు.

సుబ్రహ్మణ్య స్వామి వాజ్ పేయ్ టైం లో బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ అనుభవంతో తనకు ఆర్ధిక శాఖ కట్టబెడతారు అని ఆశించారు. అయితే మోడీ ఆయనకు ఆ చాన్స్ ఇవ్వలేదు. మొదట అరుణ్ జైట్లీని ఆ తరువాత నిర్మలా సీతారం ని తెచ్చారు.

అయితే బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు బడ్జెట్ మీద ఎపుడూ ఘాటు విమర్శలు చేస్తూ వచ్చేవారు స్వామి. ఇక రాజ్యసభ మెంబర్ షిప్ ఆయనది పూర్తి అయి చాలా కాలం అయినా బీజేపీ రెన్యూవల్ చేయలేదు. దాంతో పార్టీలో సీనియర్ నేతగా ఉంటూనే సమయం వచ్చినపుడల్లా బీజేపీ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇపుడు బీజేపీకి కొంత చేదు ఫలితాలు రావడం ఆ పార్టీ ప్రభ మసకబారడంతో స్వామి ఫుల్ జోష్ లో మోడీ మీద తన బాణాలను ఎక్కు బెడుతున్నారు.

స్వామి భాషలో చెప్పాలీ అంటే మోడీ నాయకత్వంలో బీజేపీ ఒక టైటానిక్ షిప్ మాదిరిగా మునగడం తప్ప ఫ్యూచర్ ఉండదని. మరి దాని మీద బీజేపీ పెద్దలు ఎవరైనా రియాక్ట్ అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.