బీజేపీ గెలుపులో మోడీ మ్యాజిక్ ఏమీలేదు: సుబ్రమణ్య స్వామి
బీజేపీ సీనియర్ నాయకుడు, తమిళనాడుకు చెందిన విమర్శకుడు సుబ్రమణ్య స్వామి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 26 Feb 2024 9:30 AM GMTబీజేపీ సీనియర్ నాయకుడు, తమిళనాడుకు చెందిన విమర్శకుడు సుబ్రమణ్య స్వామి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలుపులో ప్రధాని నరేంద్ర మోడీ మ్యాజిక్ ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అం తేకాదు.. ఆర్ ఎస్ ఎస్, బీజేపీల తర్వాతే వ్యక్తుల ప్రాధాన్యం ఉంటుందని.. తొలి ఓటు ఆయా సంస్థలకే పడుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో హిందూత్వం బలపడుతోందని ఆయన చెప్పారు. అయితే.. ఇది తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాం నుంచి ఉందని.. అయితే.. ఇప్పుడు కొంత పెరిగిందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ వ్యక్తి ప్రాధాన్యం కన్నా.. బీజేపీ సిద్ధాంతాలు, ఆర్ ఎస్ ఎస్‌వాదమే పనిచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి అడుగులోనూ.. బీజేపీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హిందువులకు గౌరవం పెరిగినందునే వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కాగా.. సుబ్రమణ్య స్వామి అంటే.. స్వపక్షంలోనే విపక్షం అనే మాట అందరికీ తెలిసిందే. ఆయన ఉన్న ఇంటికే వాసాలు లెక్కపెడుతుంటారని బీజేపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తారు.
ఇక, ఆది నుంచి కూడా నరేంద్ర మోడీని వ్యతిరేకించే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. నల్లధనం వెనక్కి తీసుకురావడంపై, పేదలకు పంచడంపై ప్రతిపక్షాల కంటే ముందుగా ప్రశ్నించిన నాయకుడు ఈయనే కావడం గమనార్హం.అంతేకాదు.. డీమానిటైజేషన్, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడాన్ని తప్పుబట్టారు. అయితే.. అదేసమయంలో ఆయన కాంగ్రెస్‌ను ఏమీ వెనుకేసుకు రారు. రాహుల్ చేస్తున్న పాదయాత్రలతో ప్రజలకు మేలు ఏమో కానీ..ఆయన స్మార్ట్‌గా మారారంటూ.. చురకలు అంటించారు.
ఇక, ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా.. మరోసారి జగత్ ప్రకాశ్ నడ్డాను ఎన్నుకోవడాన్ని ఆయన ఏకంగా సుప్రీం కోర్టులోనే సవాల్ చేస్తానని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఎందుకంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా.. ఒక వ్యక్తికి 2 సంవత్సరాలు మాత్రమే అవకాశం ఇస్తారు. తర్వాత.. సంస్థాగత ఎన్నికలు నిర్వహించి.. కావాలంటే.. మరోసారి ఎన్నుకోవచ్చు. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జేపీ నడ్డాను.. ఎలాంటి ఎన్నికలు లేకుండానే.. తీర్మానం ఆధారంగా ఎన్నుకున్నారు. దీంతో సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు సంచలనం రేపాయి.