ఆకస్మిక మరణాలకు కారణం అదే.. వీడిన గుట్టు, క్వారంటైన్ లో గ్రామం
ఈ కేంద్రంలో బాధితులకు 24 గంటలు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
By: Tupaki Desk | 23 Jan 2025 9:07 AM GMTజమ్మూ కాశ్మీర్లో గడిచిన కొద్దిరోజులుగా ఒక గ్రామంలో చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాల గుట్టు వీడింది. రాజోరి జిల్లాలో ఇప్పటి వరకు 17 మంది ఆకస్మికంగా మృతి చెందారు. దీనికి గల కారణాలు తెలియకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే చండీఘడ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ (సిఎఫ్ఎస్ఎల్) బృందం ఆకస్మిక మరణాలు జరుగుతున్న బుధల్ గ్రామాన్ని సందర్శించింది.
ఈ సందర్భంగా డాక్టర్ అమర్ జిత్ భాటియా సింగ్ నేతృత్వంలోని బృందం అనేక అంశాలను పరిశీలించి మరణాలకు గల కారణాలను గుర్తించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధికి గల కారణం వెల్లడైందని పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, వారంతా త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు. మరోవైపు స్థానిక వైద్యాధికారులు గ్రామాన్ని క్వారంటైన్ చేశారు. ఈ కేంద్రంలో బాధితులకు 24 గంటలు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ బృందం గుర్తించిన వివరాల ప్రకారం.. ఆకస్మిక మరణాలకు మెదడుకు హాని జరగడమే కారణంగా తెలుస్తోంది. ఫలితంగా మృతిచెందిన వారి నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ సమస్య బారిన పడి ఆసుపత్రిలో చేరిన 9 మందిలో ఐదుగురు కోలుకుంటున్నాట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాధి పట్ల ప్రస్తుతం ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాధి గురించి అవగాహన కలిగిస్తున్నారు. ప్రజలు ఆహార పదార్థాలను పంచుకోవద్దని వైద్యాధికారులు సూచించారు. మరోవైపు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు.
బాధిత కుటుంబాలకు పోషకాహారం అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దుస్తులు, మందులు, పరిశుభ్రత పరికరాలను అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం క్వారెంటెన్ కేంద్రంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖ గ్రామంలో చోటుచేసుకుంటున్న మరణాలకు నేరపూరిత చర్యలు ఏవైనా కారణమై ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సంభవించిన మరణాలకు మెదడులో వచ్చిన మార్పులే కారణంగా గుర్తించారు.