బిల్లుపై చర్చలో దాహార్తికి గురైన రామ్మోహన్ నాయుడు.. అనుకోని ట్విస్టు
రాజ్యసభలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పార్టీలకు అతీతంగా సభ్యుల మధ్య నెలకొన్న అనుబంధం.. వాత్సల్యం అందరికి అకట్టుకుంది.
By: Tupaki Desk | 6 Dec 2024 5:05 AM GMTరాజ్యసభలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పార్టీలకు అతీతంగా సభ్యుల మధ్య నెలకొన్న అనుబంధం.. వాత్సల్యం అందరికి అకట్టుకుంది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
గురువారం రాజ్యసభలో భారతీయ వాయు యాన్ విధేయక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు దాహార్తికి గురయ్యారు. దీంతో తనకు మంచినీళ్లు తెప్పించాల్సిందిగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ను కోరారు. స్పందించిన ఆయన మంచినీళ్లు తీసుకురావాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి సిబ్బంది మంచినీళ్లు తెచ్చి ఇచ్చే లోపు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు నారాయణమూర్తి సతీమణి.. రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి తన వద్ద ఉన్న మంచినీళ్ల సీసాను రామ్మోహన్ నాయుడికి అందించారు. ఆమె వాత్సల్యానికి భావోద్వేగానికి గురైన రామ్మోహన్ నాయుడు ఆమెకు రెండు చేతులతో నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతూ ఆమె ఎప్పుడూ తల్లిలా తన పట్ల ఆదరణ చూపుతున్నారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. వాయు యాన్ విధేయక్ బిల్లు విషయానికి వస్తే.. 1934లో తీసుకొచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ చట్టానికి మార్పులు చేయటంతో పాటు.. పలు అంశాల్ని కొత్త చట్టంలో పొందుపర్చారు. ఈ బిల్లుతో భద్రతను పర్యవేక్షించటం.. నియంత్రణ విధులను నిర్వహించేందుకు డీజీసీఏతో పాటు భద్రతను పర్యవేక్షించటానికి బీసీఏఎస్.. ప్రమాదాలను పరిశోధించటానికి ఏఏఐబీలపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ కసరత్తు చేయనుంది. కేంద్ర ఆయా సంస్థల ఆర్డర్లను రివ్యూ చేయొచ్చు. కావాలనుకుంటే మార్పులు చేసేందుకు వీలుగా అధికారాల్ని దఖలు చేసేందుకు ఈ నిబంధనలు నిబంధనలు ఉన్నాయి.
విమానాన్ని ప్రమాదకరంగా ఎగరటం.. విమానాల్లో ఆయుధాలు.. పేలుడు పదార్థాలను తీసుకెళ్లటం.. ఎయిర్ పోర్టులకు సమీపంలో చెత్తను జమ చేయటంతో పాటు.. జంతువులను వధించటం కూడా నేరాలుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ నేరాలకు పాల్పడే వారికి మూడేళ్ల వరకు జైలు.. రూ.కోటి వరకు ఫైన్ విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండింటిని అమలు చేసే వీలుంది. అయితే.. ఈ బిల్లు కింద ఉన్న నిబంధనల్ని ఉల్లంఘనలకు ఫైన్లు విధించిన సందర్భాల్లో వాటికి వ్యతిరేకంగా రెండో అప్పీల్ కు అవకాశం కల్పించేందుకు సైతం ఒక నిబంధనను ఇందులో చేర్చటం గమనార్హం. మారిన కాలానికి అనుగుణంగా పాత చట్టంలో లేని పలు అంశాల్ని కొత్త చట్టంలో చేర్చనున్నట్లుగా చెబుతున్నారు.