చంద్రగిరి నడిబొడ్డున పులివర్తి సుధారెడ్డి .. చెవిరెడ్డికి కాల్ చేసి సవాల్
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్ విసిరారు.
By: Tupaki Desk | 4 March 2025 1:23 PM ISTచిత్తూరు జిల్లా చంద్రగిరిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్ విసిరారు. గత ఆరు నెలలుగా తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇప్పటికే నాపై అవినీతి ఆరోపణలు చేస్తూ నన్ను కించపరుస్తున్నావు. నిజాయితీగా ఉంటే ఆధారాలతో రా" అని సుధారెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసి సవాల్ చేశారు. అందుకు సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరికి రావాలని, తన దగ్గర కూడా చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలున్నాయని తెలిపారు.
- చెవిరెడ్డి గైర్హాజరు - ప్రశ్నించిన సుధారెడ్డి
పట్టుదలతో చెప్పిన సమయానికి పులివర్తి సుధారెడ్డి క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి రాలేదు. దీంతో ఆయనకు స్వయంగా ఫోన్ చేసిన సుధారెడ్డి, లంచం ఆరోపణలు చేసినప్పుడు సవాల్‌కు అంగీకరించి ఆధారాలతో రాలేదని ప్రశ్నించారు. అయితే సుధారెడ్డి నాలుగైదు సార్లు కాల్ చేసినా కూడా చెవిరెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేశారు. దీంతో సుధారెడ్డి "సత్యం మా వైపే ఉంది. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాలేదు. పులివర్తి నానిని ఎదుర్కోలేక, తన పరువు కాపాడుకోవడానికి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు" అని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
అనంతరం చంద్రగిరిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సుధారెడ్డి మాట్లాడుతూ, తాము ప్రజాసేవకే అంకితమయ్యామని, అభివృద్ధి పరమే తమ కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే, చెవిరెడ్డి కుటుంబం మాత్రం అవినీతికి కేరాఫ్‌గా మారిందని ఆమె ఆరోపించారు. ‘‘చెవిరెడ్డి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా, తుడా ఛైర్మన్‌గా కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారు. ఆయనకు చెందిన అక్రమాస్తుల వివరాలు నా వద్ద ఉన్నాయి. ఈ విషయంపై నేను స్పష్టమైన సవాల్ విసురుతున్నాను. సాయంత్రం వరకు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర వేచిచూస్తాను. నా మీద అవినీతి ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో రాబోండి. కానీ, మీ అక్రమాలు, అవినీతి లిస్ట్ మాత్రం నా వద్ద సిద్ధంగా ఉంది’’ అని స్పష్టం చేశారు.
అలాగే ‘‘తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి చేసిన అవినీతిపై ఒక్కొక్కటిగా ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదు. చెవిరెడ్డి అక్రమాలపై త్వరలోనే ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదు చేస్తాను’’ అని ఆమె హితవు పలికారు.
ఈ ఘటనతో చంద్రగిరి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుండి స్పందన కోసం అంతా వేచి చూస్తున్నారు.