వైసీపీకి కీలక నేత రాజీనామా.. కార్పొరేటర్లపై పార్టీ వేటు!
ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఏపీ బ్రాహ్మణ సమాఖ్య చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా ప్రకటించారు.
By: Tupaki Desk | 19 Jan 2024 6:57 AM GMTఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఏపీ బ్రాహ్మణ సమాఖ్య చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్ విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం సీటును ఆశించారు. అయితే వైఎస్ జగన్.. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్ కు సీటును కేటాయించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్ చేతిలో ద్రోణంరాజు ఓటమి పాలయ్యారు.
ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించడంతో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ ను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. గతేడాది మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్ వైసీపీ తరఫున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లోనూ టీడీపీ బలపరిచిన వేపాడ చిరంజీవిరావు చేతిలో ఓటమి పాలయ్యారు.
వచ్చే ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్ విశాఖ దక్షిణం నుంచి సీటును ఆశిస్తున్నారు. అయితే ఈ సీటును వైఎస్ జగన్.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తనకు సీటు కేటాయించకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో తనకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించకపోవడం, ఇటీవల వైఎస్ జగన్ విశాఖపట్నం వచ్చిన సందర్భంలోనూ తనకు ఎలాంటి ఆహ్వానం లేకపోవడం వంటి కారణాలతో సీతంరాజు సుధాకర్ పార్టీకి రాజీనామా ప్రకటించారు.
అలాగే ఈయనతోపాటు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు సీతంరాజు సుధాకర్ కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం నలుగురు కార్పొరేటర్లపై తాజాగా వేటు వేసింది. వీరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. వైసీపీ బహిష్కరించిన నలుగురు కార్పొరేటర్లలో జానకీరామ్, నారాయణ్, జెన్, భాస్కర్ ఉన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కు వ్యతిరేకంగా వీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది.
ఇప్పటికే విశాఖలో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఇప్పుడు సస్పెండయిన నలుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు తాను వేరే పార్టీలో చేరుతున్నానని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విశాఖ దక్షిణం నుంచి పోటీ చేస్తానని సీతంరాజు సుధాకర్ ప్రకటించారు. అయితే తాను చేరబోతున్న పార్టీ కాంగ్రెస్ కాదని తెలిపారు. వైసీపీకి మరికొంతమంది కార్పొరేటర్లు కూడా రాజీనామా చేస్తారని వెల్లడించారు. వైఎస్సార్ హయాం నుంచి మొదలుకుని వైఎస్ విజయమ్మ విశాఖలో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా తాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని అయినా తనకు జగన్ అన్యాయం చేశారని వాపోయారు.