ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడి పెళ్లి ఖర్చెంతో తెలుసా?
ఇందులో భాగంగా తమ వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లు చెప్పిన సుధామూర్తి... ఇద్దరూ కలిసి వారి వివాహానికి రూ.800 మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 11 Jan 2024 11:30 PM GMTఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సుధామూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వ్యాపారవేత్తలుగానే కాకుండా... బెస్ట్ కపుల్ గా, ఆదర్శవంతమైన జంటగా కూడా వీరు సుపరిచితులు. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో ఈ జంట చెప్పే ఆనాటి సంగతులు చాలా మందిని ఆకర్షిస్తుంట్టే.. మరికొంతమందిని ఆశ్చర్యపరుస్తుంటాయి.. ఇంకొంతమందిని అనుసరించేలా చేస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా వీరి వివాహానికి అయిన ఖర్చు ఎంత అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... సుధామూర్తి తన భర్తతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వారి వివాహంనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ఇందులో భాగంగా నాడు వారి వివాహాన్ని ఎలా ప్లాన్ చేసుకుందని, ఎంత మేర ఖర్చు పెట్టుకున్నది మొదలైన వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా తమ వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లు చెప్పిన సుధామూర్తి... ఇద్దరూ కలిసి వారి వివాహానికి రూ.800 మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలిపారు.
ఇదే సమయంలో ఆ రూ.800ల్లోనూ ఇద్దరిదీ చెరిసగం వాటా అని తెలిపారు సుధామూర్తి. ఆ సమయంలో తన పెళ్లి భారీగా, ఘనంగా చేయాలని భావించిన తన తండ్రి మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలిపారు. నాడు ఆ వివాహానికి వారివైపునుంచి కేవలం ఏడుగురు మాత్రమే అతిధులు హాజరవ్వగా, తన భర్త మూర్తి వైపు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు గుర్తుచేసుకున్నారు.
అదేవిధంగా... మూర్తీ రూ.300 ఇస్తే దానితో దారంతో ఉన్న మంగళ సూత్రం కొనుక్కున్నట్లు చెప్పిన సుధామూర్తి... అప్పట్లో తమ వివాహం అరగంటలోనే పూర్తయ్యిందని, ఆ రోజుల్లో మూర్తి వద్ద డబ్బులు ఉండేవి కావని వెల్లడించారు.
ఇదే సమయంలో నాడు తన లవ్ స్టోరీని తలచుకున్న మూర్తి... సుధామూర్తిని కలవడం కోసం టికెట్ లేకుండా రైలులో 11 గంటలు ప్రయాణించిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ విషయంపై మరింతగా స్పందిస్తూ... నాడు తానూ ప్రేమలో ఉండటం.. శరీరంలో హార్మోన్లు ఉరకలెత్తేదని.. అది ఆలోచించే వయసు కాదని నవ్వుతూ తెలిపారు.