Begin typing your search above and press return to search.

నిన్న దేవుడు-నేడు విఫ‌ల నాయ‌కుడు.. టంగ్ మార్చేసిన బ్రిట‌న్ మహిళా నేత‌

ఇక‌, రెండోది.. తాజాగా ఆమెను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించారు. అంతే.. 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. సునాక్‌పై నిప్పులు చెరిగారు.

By:  Tupaki Desk   |   16 Nov 2023 11:30 AM GMT
నిన్న దేవుడు-నేడు విఫ‌ల నాయ‌కుడు.. టంగ్ మార్చేసిన బ్రిట‌న్ మహిళా నేత‌
X

రాజ‌కీయాలు రాజ‌కీయాలే. అవి భార‌త్‌లో అయినా.. అగ్ర‌ప‌థంలో దూసుకుపోతున్న బ్రిట‌న్‌లో అయినా! ఈ మాట నెటిజ‌న్లే అంటున్నారు. తాజాగా బ్రిట‌న్‌లో చోటు చేసుకున్న చిత్ర‌మైన ప‌రిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

కొన్ని నెల‌ల కింద‌ట‌!

"రుషి సునాక్‌లో మేధావి ఉన్నారు. ఆయ‌న ఈ దేశ ప్ర‌జ‌ల‌ను పాలించ‌డానికి వ‌చ్చిన లార్డ్‌(దేవుడు). ఇదొక చ‌క్క‌ని అవ‌కాశం. మునిగిపోతున్న బ్రిట‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఒక కాపు కాయ‌డానికి వ‌చ్చిన స్థితఃప్ర‌జ్ఞుడు. ఈ అవ‌కాశాని మ‌నం వ‌దులుకోరాదు"

ఇప్పుడు

"రుషి సునాక్ విఫ‌ల నాయ‌కుడు. ఆయ‌న‌కు ఆర్థిక ప‌రిస్థితి అర్థం కావ‌డం లేదు. చిన్న‌పిల్ల‌ల చేష్ఠ‌లు చేస్తున్నాడు. ఎన్నిక‌ల హామీల్లో ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేదు. మీ ప‌నితీరు మార్చుకోవాలి. మిమ్మ‌ల్ని ప్ర‌జ‌లు ఓ జోక‌ర్‌లా చూస్తున్నారు"

క‌ట్ చేస్తే..

పైరెండు వాద‌న‌లు కూడా ఒక్క‌రివే. ఆవిడే బ్రిట‌న్ అధికార పార్టీకి చెందిన భార‌త సంత‌తి మ‌హిళ సుయెల్లా బ్రేవ‌ర్మ‌న్‌. రుషి సునాక్‌.. అనూహ్యంగా ప్ర‌ధాని అయిన త‌ర్వాత‌.. బ్రేవ‌ర్మ‌న్‌ను హోం శాఖ మంత్రిగా ప్ర‌క‌టించి.. అధికారాలు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో ఆమె చేసిన తొలి ప్ర‌సంగంలో సునాక్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఆ ప్ర‌సంగంలోని కొన్ని పంక్తులే తొలి పేరా. ఇక‌, రెండోది.. తాజాగా ఆమెను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించారు. అంతే.. 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. సునాక్‌పై నిప్పులు చెరిగారు.

ఎందుకు తొల‌గించారంటే..

కొద్దిరోజుల క్రితం లండన్‌లో పాలస్తీనా మద్దతుదారులు ర్యాలీ నిర్వ‌హించారు. హోం మంత్రిగా ఉన్న సుయెల్లా ఈ ర్యాలీని ఇష్ట‌ప‌డ‌లేదు. పైగా.. ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరుపై బ్రేవర్మన్‌ విమర్శలు చేశారు. ఇవి దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. ప‌త్రిక‌లు విరుచుకుప‌డ్డాయి. దీంతో ఆమెను మంత్రి వర్గం నుంచి సునాక్‌ తొలగించారు.

టంగ్ స్లిప్‌!

త‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించ‌గానే బ్రేవ‌ర్మ‌న్ టంగ్ మార్చేశారు. "ప్రధాని అభ్యర్థిగా మీరు పోటీలో ఉన్నప్పుడు.. పలు అంశాలపై మీరిచ్చిన హామీల కారణంగానే.. నేను మీకు మద్దతిచ్చాను. కానీ, వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారు. మీ నిర్ణయాలు పనిచేయడం లేదు. మీరో విఫ‌ల నేత‌. ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొనక ముందే మీ పనితీరును మార్చుకోవాలి. మీరు బలహీనంగా ఉన్నారు. ఈ దేశ ప్రధానికి ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు మీలో లేవు" అని బ్రేవర్మన్ సునాక్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

నెటిజ‌న్ల కామెంట్స్‌

బ్రేవ‌ర్మ‌న్ రాసిన లేఖ‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రిట‌న్ రాజ‌కీయాల‌ను ఫాలో అవుతున్న నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందించారు. "ఎంత నేర్చినా ఎంత వార‌లైనా.. రాజ‌కీయాల్లో ప‌ద‌వులు పోయేస‌రికి ఇంతే బ్రో! రాజ‌కీయాలు ఎక్క‌డైనా రాజ‌కీయాలే" అని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, వ‌చ్చే ఏడాది ఇక్క‌డ ప్ర‌ధాని ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.