పాక్ లో ఉగ్రవాదుల వర్క్ ఫ్రం హోం... 52 మంది మృతి!
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో తాజాగా శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది.
By: Tupaki Desk | 29 Sep 2023 11:34 AM GMTపాకిస్థాన్ అనే దేశం ఉగ్రవాదుల అడ్డా అని.. నిషేధిత ఉగ్రవాద సంస్థలన్నింటికీ పాకిస్థాన్ బెస్ట్ రెసిడెన్షియల్ ప్లేస్ అని.. భారత్ పైకి ఉగ్రవాదులను పంపడానికి నిత్యం ప్రయత్నిస్తుంటుందని.. ప్రపంచంలోని ప్రజల ప్రశాంతతను పోగొట్టడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటుందని చెబుతుంటారు. పలు దేశాలు ప్రపంచ వేధికలపై ఈ విషయాన్ని ఎన్నోసార్లు వెల్లడించాయి.
ఇక భారత్ విషయానికి వచ్చే సరికి చెప్పే పనేలేదు. భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాదులు చెలరేగినా, ఎక్కడ బాంబు బ్లాస్ట్ లు అయినా... వాటి పునాదులు పాకిస్థాన్ లోనే ఉన్నాయని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైన సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడులపై ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ వైఖరిని భారత్ ఎండగడుతూనే ఉంటుంది. ఆ సంగతి అలా ఉంటే... పాక్ లో ఉగ్రవాదులు తాజాగా వర్క్ ఫ్రం హోం చేశారని తెలుస్తుంది.
అవును... పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో తాజాగా శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. తాజాగా ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఘోర ఘటనలో కనీసం 52 మంది మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన పాకిస్థాన్ లోని ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు.
మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 52 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.
ఇదే సమయంలో గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ర్యాలీలో విధుల్లో ఉన్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ సూసైడ్ బాంబర్ డీఎస్పీ కారు పక్కనే నిలబడి పేల్చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారమని పోలీసులు వెల్లడించారు.