సూట్ కేస్ లో మహిళ మృతదేహం... ఎవరీ కాంగ్రెస్ కార్యకర్త?
హర్యానాలోని సంప్లా పట్టణంలో గల బస్టాండ్ దగ్గర ఉన్న సూట్ కేసులో ఓ యువతి మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
By: Tupaki Desk | 2 March 2025 3:34 PM ISTహర్యానాలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. రోహ్తక్ జిల్లాలోని సంప్లా సిటీలో మార్చి 1 ఉదయం బస్టాండ్ దగ్గర ఓ సూట్ కేసు అనుమాస్పదంగా పడి ఉంది. దీంతో... అటుగా వెళ్తున్న వ్యక్తులు దాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడకు చేరుకున్న పోలీసులు సూట్ కేస్ తెరిచి చూడగా.. షాకింగ్ విషయం బయటపడింది.
అవును... హర్యానాలోని సంప్లా పట్టణంలో గల బస్టాండ్ దగ్గర ఉన్న సూట్ కేసులో ఓ యువతి మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఆ మృతదేహాన్ని చూస్తే.. ఆమెను ఎవరో అత్యంత దారుణంగా హత్య చేసి సూట్ కేసులో పెట్టి పడేశారని పోలీసులు భావిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. మృతురాలు కాంగ్రెస్ నాయకురాలని గుర్తించారు!
వాస్తవానికి తొలుత మృతురాలిని గుర్తించనప్పటికీ.. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలని, ఆమె పేరు హిమాని నర్వాల్ అని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుందని అంటున్నారు.
ఈ సమయంలో సంప్లా పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. ఇక.. ఈ హత్యకు వ్యక్తిగత శత్రుత్వమే కారణమా.. లేక ఏదైనా రాజకీయ కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన సంప్లా పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ బిజేంద్ర సింగ్.. ఈ కేసును పరిష్కరించడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హిమానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోపక్క సైబర్ టీమ్ ఆమె సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తోందని అన్నారు.
కాగా... హిమానీ నర్వాల్ చురకైన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రతో పాటు పార్టీలోని ప్రతీ ప్రధాన కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మరణాన్ని ఎమ్మెల్యే బీబీ బాత్రా ధృవీకరించారు. ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసి దర్యాపు చేయాలని డిమాండ్ చేశారు.