వరదలకు దూరంగా సుజనా..? ప్రజలు ఏమంటున్నారంటే..!
ఓ వైపు విజయవాడ వరదలతో కకావికలం అవుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
By: Tupaki Desk | 4 Sep 2024 10:30 AM GMTఓ వైపు విజయవాడ వరదలతో కకావికలం అవుతోంది. ఇంత ఆందోళనకర పరిస్థితిలో విజయవాడ పశ్చిమ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సుజనా మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదనే ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు ప్రజలు నరకం చూస్తుంటే.. సుజనా చౌదరి మాత్రం ఢిల్లీలో ఏసీ రూముల్లో రిలాక్స్ అవుతున్నారనే గుసగుసలు నడుస్తున్నాయి. ఏదో చుట్టపు చూపుగా ఒక్కరోజు మాత్రమే వచ్చి అలా బాధితులతో మాట్లాడి వెళ్లారని, లోకల్ ఎమ్మెల్యే అయి ఉండి నిత్యం ప్రజల వెంటే ఉండి.. వారి బాగోగులు చూడాల్సిన నాయకుడు స్థానికంగా లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తాము ఓట్లు వేస్తేనే గెలిచిన నేత అయినప్పటికీ.. తాము కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. ఆయనకు పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వకున్నా.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలిపించుకున్నామని.. బీజేపీ తరఫున గెలిచిన ఆయన స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో వెనుకబడ్డారని అంటున్నారు. ఎప్పుడు ఎక్కడా ఉన్నా పర్లేదు కానీ.. పెద్ద విపత్తు వచ్చిన సమయంలోనూ తమ వైపు లేకపోవడం బాధేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓట్లు వేసి గెలిపించినందుకు తమకు తగిన విధంగా చేస్తున్నాడంటూ ప్రజలు సైతం పెదవి విరిస్తున్నారని టాక్ నడుస్తోంది.
సుజనా సైతం అదే పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నుంచి గెలుపొందారు. ఇంత పెద్ద విపత్తు వచ్చిన వేళ స్వయంగా కేంద్రంతో మాట్లాడి ప్యాకేజీ తీసుకురావచ్చు కదా అని ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలు అన్ని కష్టాల్లో ఉంటే కేంద్రాన్ని కోరితే సాయం చేయదా..? అని విమర్శిస్తున్నారు. ఆయన పోయి ఢిల్లీలో ఉంటే.. స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు సైతం వరదల్లో కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ఏ ఒక్క బీజేపీ నేత కూడా వరద ప్రాంతాలకు రాలేదని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు వరదను లైట్‌గా తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని వదిలేసి.. కేంద్రంతో మాట్లాడి మంచి ప్యాకేజీ తీసుకొచ్చి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిపై ఓ ప్రెస్‌మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు సుజనాచౌదరి స్పందించారు. గత మూడు రోజులుగా పార్టీ పరంగా, తన వ్యక్తిగతంగా సేవల్లో పాల్గొంటున్నానని చెప్పారు. గెలుపుఓటములకు సంబంధం లేకుండా.. తన నియోజకవర్గంతోపాటు పక్క నియోజకవర్గంలోనూ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. సేవ చేయాలంటే కనిపించాల్సిన అవసరం లేదని.. కనిపించకుండా ప్రజా సేవ చేస్తే చాలని అన్నారు. ఫొటోలకు, వీడియోలకు తాను దూరమని.. మాటలు చెప్పేవాడిని కాదని, పనులు చేసే వాడిని అని స్పష్టం చేశారు. ఇదే విషయం తమ నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చారు.