అనూహ్యంగా రాజ్యసభ రేసులోకి సుజనా చౌదరి ?
రాజ్యసభ సీటు రేసులో చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకూ నామినేషన్లు వేసేందుకు సమయం ఉంది.
By: Tupaki Desk | 5 Dec 2024 3:39 AM GMTరాజ్యసభ సీటు రేసులో చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకూ నామినేషన్లు వేసేందుకు సమయం ఉంది. దాంతో తెర ముందు వినిపించే పేర్లు, కనిపించే నేతలతో పాటు తెర వెనక చాలా మంది ప్రముఖులు కూడా రాజ్యసభ సీటు మీద మోజు పెంచుకుంటున్నారు అన్న ప్రచారం అయితే ఉంది.
రాజ్యసభ సీటు విషయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయిన సుజనా చౌదరి పూర్తి ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. ఆయన తన కెరీర్ నే రాజ్యసభ ఎంపీతో మొదలెట్టారు. అలా ఆయన టీడీపీ నుంచి రెండు టెర్ములు అంటే 12 ఏళ్ల పాటు పనిచేశారు.
ఇక 2019లో వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆయన బీజేపీలోకి చేరిపోయారు. ఆయన పదవీకాలం 2022తో పూర్తి అయింది. నిజానికి సుజనా చౌదరి బీజేపీ లోకి వెళ్లడానికి కారణం కేంద్ర మంత్రి కావడమే అని అప్పట్లో ప్రచారం సాగింది. ఆ మేరకు ఆయనకు హామీ ఇవ్వడం వల్లనే ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు అని కూడా చెబుతారు.
కానీ బీజేపీ కేంద్ర మంత్రి పదవిని కానీ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని కానీ సుజనా చౌదరీకి ఇవ్వలేదు. ఇక 2022లో మాజీ ఎంపీగా మారిన ఆయన రెండేళ్ళ పాటు ఖాళీగా ఉన్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయాలని చూసినా కుదరలేదు. దాంతో విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు.
ఈ ఎమ్మెల్యే పదవిలో ఆయన ఉన్నా ఆయన ఆశలు అయితే తీరడం లేదని అంటున్నారు. కేంద్ర రాజకీయాల్లో ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి కేవలం ఎమ్మెల్యేగా ప్రస్తుతం మిగిలిపోవడం పట్ల అనుచరులలోనూ ఆవేదన ఉంది. ఈ నేపధ్యంలో రాజ్యసభ సీటు మీద ఆయన కన్ను పడింది అని అంటున్నారు.
రాజ్యసభకు నెగ్గి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకుంటే తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక బీజేపీ హైకమాండ్ అయితే మూడు సీట్లలో రెండు తమకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వాన్ని కోరుతోందని అంటున్నారు. రాజ్యసభలో తమకు సంఖ్యాబలం అవసరం అయినందువల్ల ఆ మేరకు తమకు వదిలేయాలని కోరిందని టాక్.
అంటే ఆర్ క్రిష్ణయ్యతో పాటు మరో సీటు అన్న మాట. అపుడు టీడీపీకి ఒక్కటే సీటు దక్కుతుంది. అది బీద మస్తాన్ రావుకు కన్ ఫర్మ్ అంటున్నారు. దీంతోనే ఉభయ కుశలోపరిగా సుజనా చౌదరి పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఆ రెండవ సీటు సుజనా చౌదరికి అయితే ఇచ్చేందుకు టీడీపీకి కూడా అభ్యంతరం ఉండబోదు అని అంటున్నారు.
ఎందుకంటే సుజనా చౌదరి టీడీపీలోనే పుట్టి పెరిగారు. ఆయన బాబుకు అత్యంత సన్నిహితుడుగా టీడీపీలో ఉన్నపుడు నిలిచారు. ఆయనకు కనుక రాజ్యసభ సీటు ఇస్తే అది టీడీపీకి కూడా మేలుగానే ఉంటుందని ఫ్యూచర్ లో ఆయన కేంద్ర మంత్రి అయినా రాష్ట్రానికి లాభంగా ఉంటుందని భావిస్తున్నారుట. ఈ ప్రతిపాదన ఇపుడు బీజేపీ కేంద్ర పెద్దల వద్ద ఉందని టాక్. వారు ఓకే అంటే సుజనా చౌదరి బీజేపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ముందుకు వస్తారు అని అంటున్నారు.
ఇక ఆయన రాజ్యసభకు వెళ్తే ఆయన సీటు విజయవాడ పశ్చిమ ఖాళీ అయి ఉప ఎన్నికలు వస్తాయి. కూటమి ఏపీలో వెరీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సులువుగా నెగ్గేందుకు అన్ని అవకాశాలు ఉంటాయని అందుకే సుజనా చౌదరిని రాజ్యసభకు పంపేందుకు తెర వెనక జోరుగానే కసరత్తు సాగుతోందని అంటున్నారు.