నేను లోకలే.. పుట్టుకతోనే ధనవంతుడిని!
టీడీపీలో ఉన్నప్పుడు ఆయన బాగానే ఉండేవారని.. వైసీపీలోకి వెళ్లాక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 2 April 2024 4:22 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేసిన నాన్ లోకల్ కామెంట్స్ దుమారం రేపాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన సుజనా చౌదరి.. కేశినేని నానిపై మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన బాగానే ఉండేవారని.. వైసీపీలోకి వెళ్లాక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత త్వరగా రాజకీయాల్లో కేశినేని నాని దిగజారిపోతారని అనుకోలేదన్నారు.
తనది విజయవాడేనని.. తాను లోకల్ అని సుజనా చౌదరి తేల్చిచెప్పారు. విజయవాడలోనే చదువుకున్నానని.. తనకు వ్యవసాయ భూమి కూడా ఉందన్నారు. చదువులు, ఉద్యోగాల కోసం ఎంతోమంది వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారని.. అలాగే తాను కూడా వెళ్లానన్నారు. కేశినేని నాని తనను ధనికుడినని అంటున్నారని.. ఈ విషయాన్ని ఆయన చెప్పడమేంటని.. ఈ విషయాన్నే చాలాసార్లు తానే చెప్పానని గుర్తు చేశారు. తాను పుట్టుకతోనే ధనవంతుడినన్నారు.
తాను పోటీ చేస్తానని పార్టీకి దరఖాస్తు చేసుకోలేదని, కూటమిలో మూడు పార్టీలు కలిసి తనను అభ్యర్థిగా ఎంపిక చేశాయని సుజనా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు.
తాను ప్రత్యర్థులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని సుజనా చౌదరి తేల్చిచెప్పారు. దిగజారి మాట్లాడుతున్న కేశినేని నానిపై సానుభూతి చూపడం తప్ప తాను మరేమీ చేయలేనన్నారు.
విజయవాడ పశ్చిమ టికెట్ ను ఆశించిన జనసేన నేత పోతిన వెంకట మహేశ్ తో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడతారని సుజనా చౌదరి తెలిపారు. పోతిన కూడా తనతో కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలిసి పనిచేసి గెలిచి చూపిస్తామన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని.. దీంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తుందని సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా సుజనా చౌదరి స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్ల. టీడీపీ తరఫున రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉన్న బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో సుజనా చౌదరికి విస్తృత పరిచయాలు ఉన్నాయి.
కాగా విజయవాడ తూర్పు నుంచి 1999లో బీజేపీ తరఫున ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ బీజేపీ తరఫున విజయవాడ నగరంలో ఒక్క అభ్యర్థి కూడా ఇప్పటివరకు గెలుపొందలేదు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఈ రికార్డును బ్రేక్ చేస్తారో, లేదో వేచిచూడాల్సిందే.