Begin typing your search above and press return to search.

బీజేపీ కీలక నేతకు ఇది గట్టి దెబ్బే!

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఎన్నికల ముంగిట గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

By:  Tupaki Desk   |   19 April 2024 7:23 AM GMT
బీజేపీ కీలక నేతకు ఇది గట్టి దెబ్బే!
X

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఎన్నికల ముంగిట గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినేషన్‌ ను కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చింది. దీంతో దివాలా ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయన ఆస్తుల అమ్మకాలను, కొనుగోళ్లను నిలిపివేసింది.

సుజనా చౌదరి స్వతహాగా వ్యాపారవేత్త. ఆయనకు పలు వ్యాపారాలున్నాయి. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. మొదట్లో టీడీపీలో ఉన్న ఆయన ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను చేపట్టారు. 2019లో టీడీపీ ఓటమి పాలయ్యాక అప్పటికి టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి బీజేపీలో చేరారు. గతేడాది ఆయన పదవీకాలం పూర్తయింది. దీంతో ఇప్పుడు విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కాగా వ్యాపారాల నిమిత్తం సుజనా చౌదరి తీసుకున్న కొన్ని రుణాలను చెల్లించలేదని తెలుస్తోంది. ఆయనకు చెందిన స్లె్పండిడ్‌ మెటల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌.. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో రూ.500 కోట్లు అప్పులు తీసుకుంది. ఈ మొత్తానికి సుజనా చౌదరి గ్యారెంటీ ఇచ్చారు. అయితే రుణాలు చెల్లించలేక చేతులెత్తేయడంతో సుజనా దివాలా పిటిషన్‌ ను దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ దివాళా పరిష్కారకర్త (రెజల్యూషన్‌ ప్రొఫెషనల్‌)ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సుజనా చౌదరి ఆస్తుల మదింపు చేపట్టి, వేలం ద్వారా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. 2021లోనే ఈ పిటిషన్‌ దాఖలు చేయగా ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ విచారణ జరిపి తాజాగా ఇచ్చింది.

ఎస్‌బీఐ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రుణదాతకు ఏదైనా కంపెనీ, వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఉన్న వాళ్లు బాధ్యత వహించాలని చట్టంలో ఉందన్నారు. ఇందుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ రుణానికి సుజనా చౌదరి గ్యారెంటీ ఇచ్చారని.. దీంతో ఆయనే బాధ్యుడు అవుతారన్నారు. దీంతో ఎన్‌సీఎల్‌టీ దివాలా ప్రక్రియను ప్రారంభించింది. సుజనా ఆస్తులను మదింపు చేపట్టి ఎస్‌బీఐకి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఫైనల్‌ చేస్తారని తెలుస్తోంది.

సుజనా చౌదరి స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్ల. టీడీపీ తరఫున రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.