మహిళల కనీస వివాహ వయసు 21... ఆ రాష్ట్రం సంచలన నిర్ణయం!
అవును... మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే బిల్లును హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది.
By: Tupaki Desk | 29 Aug 2024 10:01 AM GMTమహిళల కనీస వివాహ వయసు తగ్గిస్తూ కొన్ని దేశాలు దుర్మార్ఘమైన బిల్లులను ప్రవేశపెడుతున్న ఈ రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అభినందనీయమైన ఓ నిర్ణయం తీసుకుంది! ఇందులో భాగంగా.. ఇకపై మహిళల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమొదం తెలిపింది.
అవును... మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే బిల్లును హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ఇందులో భాగంగా... బాల్య వివాహాల నిషేధ (హిమాచల్ సవరణ) బిల్లు - 2024 వాయిస్ ఓటుతో ఆమోదించబడింది. దీంతో... 2006లో పార్లమెంట్ ఆమోదించిన బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఈ బిల్లు సవరించినట్లయ్యింది.
ఈ నేపథ్యంలో... లింగ సమానత్వం, మహిళల ఉన్నత విద్యకు మద్దతుగా వారి వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే బిల్లుకు ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఈ బిల్లును మహిళా సాధికారత మంత్రి ధని రామ్ షాండిల్ రాష్ట్ర అసెంబ్లీలొ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
నేటి ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నారు. అయితే.. బాల్య వివాహాలు వారి కెరీర్ పురోగతికి మాత్రమే కాకుండా వారి శరీరక అభివృద్ధికికూడా ఆటంకంగా పనిచేస్తాయి. లింగ సమానత్వం, ఉన్నత విద్యనూ పొందే అవకాశాలను అందించడానికి.. వారి కనీస వివాహ వయసును పెంచడం అవసరం. అందుకే వారి కనీస వివాహ వ్యసును 21 సంవత్సరాలుగా పెంచాలని ప్రతిపదించబడిందని బిల్ పేర్కొంది.
ఈ సందర్భంగా స్పందించిన ఆరోగ్య, సామాజిక న్యాయ, సధికరత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ స్పందిస్తూ.. కొంతమంది అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారని.. ఇది వారి చదువుకు, జీవితంలో పురోగతి సాధించడానికి తీవ్ర ఆటంకం కలిగిస్తోందని అన్నారు. ఇదే క్రమంలో చాలా మంది మహిళలు ముందస్తు వివాహం కారణంగా తమ కెరీర్ లో విజయం సాధించలేకపోతున్నారని అన్నారు.
ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖూ మాట్లాడుతూ... మహిళల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు స్పష్టంగా చూపిందని.. ఆడపిల్లల వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచడానికి చట్టం చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం తమదే అని.. మహిళల అభ్యున్నతికి కృషి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు!