నా ఇంటికి ఎందుకు వచ్చావ్? ఎమ్మెల్యేను నిలదీసిన వైసీపీ ఎంపీటీసీ
సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సొంత పార్టీకి చెందిన మహిళా నేత చేతిలో చేదు అనుభవం ఎదురైంది
By: Tupaki Desk | 1 Aug 2023 7:06 AM GMTతిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక గడప గడపకు మన పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా చేపట్టాల్సిందేనని స్పష్టం చేయటం తెలిసిందే. టికెట్ సాధనలో ఈ ప్రోగ్రాంలో ఎంతలా పాలు పంచుకున్నారన్నది కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పటం తెలిసిందే. తాజాగా అలాంటి పనే చేసిన సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సొంత పార్టీకి చెందిన మహిళా నేత చేతిలో చేదు అనుభవం ఎదురైంది.
తాజాగా ఆయన ఓజిలి మండలం కురుగొండలో వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ.. ప్రస్తుతం ఎంపీటీసీగా వ్యవహరిస్తున్న ఇందిరమ్మ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేను చూసినంతనే తీవ్రఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే గెలుపు కోసం తాను రూ.3 లక్షల మొత్తాన్ని ఖర్చు చేశానని పేర్కొన్నారు. కానీ.. తనకు రెండోసారి ఎంపీపీ పదవి రాకుండా అడ్డుకోవటం ఏమిటని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
గతంలో తాను పని చేసి వదిలేసిన పదవి కోసం తాను బాధపడటం లేదని.. నమ్మి గెలిపిస్తే మోసం చేయటం ఏమిటి? అంటూ నిలదీశారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ భర్త కలుగజేసుకొని.. ఎమ్మెల్యేతో అలా మాట్లాడొద్దని వారించినా ఆమె తగ్గలేదు. ప్రస్తుతం వైసీపీ ఎంపీటీసీగా వ్యవహరిస్తున్న ఇందిరమ్మ తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే తీరును పలువురు తప్పు పడుతున్నారు. స్థానికంగా అందరిని కలుపుకుపోవాల్సింది పోయి.. ఇలా చేయటం ద్వారా పార్టీకి ఇబ్బందిగామారుతుందన్న మాట వినిపిస్తోంది.