Begin typing your search above and press return to search.

ఇక మొదలుపెట్టినట్లేనా?.. ఐపీఎస్ సునీల్ పై సీఐడీ విచారణ!

ఒకప్పుడు సీఐడీ బాస్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఇప్పుడు అదే శాఖలో విచారణ ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 10:31 AM GMT
ఇక మొదలుపెట్టినట్లేనా?.. ఐపీఎస్ సునీల్ పై సీఐడీ విచారణ!
X

ఒకప్పుడు సీఐడీ బాస్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఇప్పుడు అదే శాఖలో విచారణ ఎదుర్కొంటున్నారు. సీఐడీ అధిపతిగా ఉండగా, నిబంధనలు అతిక్రమించి వ్యవహరించారని, వ్యక్తుల స్వేచ్ఛను హరించారని ఆయనపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ కోరడంతో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఓ న్యాయవాది, మరో జర్నలిస్టుతోపాటు ఇద్దరు టీడీపీ నేతల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో సునీల్ కుమార్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐపీఎస్ అధికారి సునీల్ కుమారును వీఆర్ లో పెట్టారు. డీజీ క్యాడరులో ఉన్న ఆయనపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు నమోదు చేశారు. అదేవిధంగా పలు అవినీతి ఆరోపణలూ చేస్తున్నారు. కానీ, దేనికీ ఆధారాలు లేకపోవడం వల్ల సునీల్ కుమారుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందంటున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారనే కారణంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాతో కమిటీ వేశారు. ప్రభుత్వం టార్గెట్ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సునీల్ పై తాజాగా సీఐడీ విచారణ మొదలుపెట్టడం చర్చనీయాంశమవుతోంది.

గత ప్రభుత్వంలో అప్పటి వైసీపీ పెద్దలకు అనుకూలంగా సునీల్ కుమారు వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ పాలనను ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో సునీల్ పై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందంటున్నారు. అయితే ఆయన అఖిల భారత స్థాయి అధికారి కావడంతో ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఆటంకంగా మారాయని అంటున్నారు. దీంతో సునీల్ ను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు పంపి, అటు నుంచి నరుక్కురావాలని చూస్తున్నారంటున్నారు.

దీంతో గత ప్రభుత్వంలో సునీల్ వ్యవహరించిన తీరును వివరిస్తూ న్యాయవాది లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెబుతున్నారు. సీఐడీ డీజీగా సునీల్ కుమారు పనిచేసిన సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు, జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేసి, కస్టోడియల్ టార్చర్, థర్డ్ డిగ్రీ ప్రయోగించేవారని లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. సునీల్ సీఐడీ చీఫ్ గా పనిచేసిన కాలంలోనే ఈ ఫిర్యాదులు చేయగా, అప్పటి ప్రభుత్వం వాటిని తొక్కిపెట్టిందని అంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదుపై విచారించి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ అదేశించింది.

కేంద్ర హోంశాఖ కోరిక ప్రకారం విచారణకు సీఎస్ విజయానంద్ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు న్యాయవాది లక్ష్మీనారాయణతోపాటు సునీల్ కుమారు బాధితులుగా చెప్పుకుంటున్న సీనియర్ జర్నలిస్టు అంకబాబు, టీడీపీ మీడియా సెల్ ఇన్ చార్జి, దారపనేని నరేంద్ర, సోషల్ మీడియా నేత గార్లపాటి వెంకటేశ్వరరావు నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. జర్నలిస్టు అంకబాబు వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేశారని, దుర్భాషలాడరని ఆయన వాంగ్మూలమిచ్చారు. అదేవిధంగా టీడీపీ నేతలు సైతం తమకు సీఐడీ కస్టడీలో కొట్టారని ఫిర్యాదులు చేశారు. ఈ సంఘటనల వెనుక సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నట్లు తాము భావిస్తున్నామని వరు సీఐడీకి తెలిపారు. దీంతో ప్రభుత్వం ఐపీఎస్ సునీల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.