వెయిట్ చేయ్.. ఆ డీఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తా: జగన్ అభయం
ఏపీలో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కడుతున్న కేసులపై వైసీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
By: Tupaki Desk | 25 March 2025 10:26 AM ISTఏపీలో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కడుతున్న కేసులపై వైసీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని.. అంతకంతకూ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్న వైనాలు పెరుగుతున్నాయి. ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఉదంతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
హత్య మూవీలో తన పాత్రను తప్పుడు పద్దతిలో చూపించారని మండిపడుతూ సునీల్ యాదవ్ పోలీసులకు కంప్లైంట్ చేయటం.. ఇందులో భాగంగా పులివెందుల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ మీద ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సునీల్ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో పవన్ కుమార్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. సదరు పవన్ కుమార్ తాజాగా జగన్మోహన్ రెడ్డిని కలివారు.
వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ కు ఆడ్మిన్ గా ఉన్న పవన్ కుమార్ ను జగన్ ఊరడించారు. తనపై పెట్టిన కేసు గురించి జగన్ కు చెప్పగా.. ఆయన తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. తనను అదుపులోకి తీసుకొని విచారించారన్న అంశంతో పాటు.. విచారణ వేళ తనను డీఎస్పీ.. సీఐ కొట్టారంటూ జగన్ కు ఫిర్యాదు చేశారు.
పవన్ కుమార్ మాటలకు స్పందించిన జగన్ అతన్ని ఓదార్చారు. మూడేళ్లు వెయిట్ చేయాలని.. ‘మనం అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ.. సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా. అప్పటివరకు ధైర్యంగా ఉండు’ అని అభయమిచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా పవన్ కుమార్ ను మరోసారి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులకు ఇప్పటికే 41ఏ కింద నోటీసులు ఇచ్చారు.