ఏడాదిలో డబుల్ సక్సెస్!
రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించటం అంటే మామూలు విషయం కాదు.
By: Tupaki Desk | 4 Dec 2023 5:26 AM GMTఒక విజయం సాధిస్తేనే చాలా హ్యాపీగా ఫీలవుతారు. అలాంటిది తమ ఖాతాల్లో రెండు విజయాలు నమోదైతే ఇంకెంత హ్యాపీగా ఫీలవుతారు ? ఇదంతా ఎవరి విషయం అంటే కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు గురించే. ఒకే ఏడాదిలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత సునీల్ ఖాతాలో పడింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించటం అంటే మామూలు విషయం కాదు.
ఈ ఏడాది మేలో కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ హస్తంపార్టీ ఘనవిజయంలో సునీల్ కీలకపాత్ర పోషించారు. రాజకీయ పరిస్దితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తు, ప్రత్యర్ధి వ్యూహాలకు ఎత్తులు పై ఎత్తులు వేస్తు పార్టీ ఘనవిజయం సాధించటంలో సునీల్ కీలక పాత్ర పోషించారు. అప్పటికే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ కోసం సునీల్ పనిచేయటం మొదలుపెట్టారు. సునీల్ వ్యూహాల వల్ల కాంగ్రెస్ కు లభించిన విజయంతో తెలంగాణాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
దాంతో సునీల్ ఆపీసులపైన, బృందాలపైన రెగ్యులర్ గా పోలీసులు దాడులు జరిపి కేసులు నమోదుచేశారు. దాంతో ఇక్కడ లాభంలేదని చెప్పి సునీల్ తన కార్యస్ధానాన్ని బెంగుళూరుకు మార్చేశారు. అక్కడి నుండే తెలంగాణా కాంగ్రెస్ కు అవసరమైన సర్వీసులు ఇచ్చారు. పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించటం అంటే మామూలు విషయం కాదు. అందుకనే సునీల్ బృందం 119 నియోజకవర్గాల్లోను విస్తృతంగా పనిచేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక యూనిట్ గా తీసుకుని దేనికదే విడివిడిగా వ్యూహాలను అమలుచేసింది.
ఓవరాల్ గా మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి, బైబై కేసీయార్ అనే స్లోగన్లు జనాల్లోకి బాగా ఎక్కింది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో చేసిన ప్రచారం సూపర్ హిట్టయింది. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవటం, జనాలను ఆకర్షించటం లాంటి కారణాల వెనుక సునీల్ కష్టం చాలా ఉంది. అందుకనే ఏడాదిలో సాధించిన డబుల్ సక్సెస్ ను సునీల్ ఎంజాయ్ చేస్తున్నారు.