Begin typing your search above and press return to search.

సునీల్ కనుగోలు మాట రెండు రాష్ట్రాలు వింటే.. రెండు రాష్ట్రాలు వినలేదా?

గతకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శించడానికి ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కారణం అని చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 3:45 AM GMT
సునీల్  కనుగోలు మాట రెండు రాష్ట్రాలు వింటే.. రెండు రాష్ట్రాలు వినలేదా?
X

గతకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శించడానికి ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కారణం అని చెబుతుంటారు. ప్రధానంగా కర్ణాటకలో కాంగ్రెస్ విక్టరీ వెనుక ఆయన వ్యూహాలు పనిచేశాయని చెబుతారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి సునీల్ వ్యూహాలే కారణం అని అంటున్నారు. మరి మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో పరిస్థితి అలా ఎందుకు ఉంది.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇలా ఎందుకు ఉంది?

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న చర్చ ఇది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజాగ్రహాన్ని గుర్తించిన సునీల్... దానికి అనుగుణంగానే పార్టీ అక్కడ ఐదు హామీలను ముందుకు తెచ్చింది. ఆ ఐదు గ్యారెంటీలే కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి పూలబాట వేశాయని చెబుతారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ బీఆరెస్స్ ప్రభుత్వంపై వీచిన వ్యతిరేక పవనాలను ఆయన హస్తం హవాకు ఉపయోగించుకున్నారు.

అయితే... మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ‌ విషయంలో ఆయన ఇచ్చిన సలహాలను పట్టించుకోకపోవడంతో పార్టీ భారీ నష్టాన్ని కూడా భరించాల్సి వచ్చిందనే చర్చ ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో మొదలైందని చెబుతున్నారు. సునీల్ లో ఉన్న విషయాన్ని, ఆయన మాటను కర్ణాటక కాంగ్రెస్ నేతలు.. మరి ముఖ్యంగా డీకే శివకుమార్ బాగా ఫాలో అయ్యారని అంటున్నారు.

ఈ విషయాలపై స్పందించిన ఆయన... తెలంగాణలోనూ సునీల్ అదరగొట్టారు.. ఆయన వ్యూహాలు బాగా పనిచేశాయి. అయితే.. పార్టీ అధ్యక్షుడికీ – సునీల్ కి మధ్య సమన్వయం పక్కాగా కుదిరితే విజయం సిద్దించే ఛాన్స్ పుష్కలంగా ఉంటుంది అని డీకే శివకుమార్ చెబుతుంటారని తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో సునీల్ పెఫార్మెన్స్ ను చూసిన ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు.

ఉదాహరణకు కర్ణాటకలో కాంగ్రెస్ పెద్దలు సునీల్ వ్యూహాలను పూర్తిగా స్వాగతించారు. ఆ రాష్ట్రంలోని కాంట్రాక్టు పనుల్లో అవినీతి జరిగిందని వెల్లువెత్తిన ఆరోపణల ఆధారంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా... పేటీఎం తరహాలో "పే సీఎం" అంటూ క్యూఆర్ కోడ్‌ లతో కూడిన పోస్టర్లను తెరపైకి తెచ్చారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సమయంలో ఐదు గ్యారెంటీలను తెరపైకి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, అన్న భాగ్య యోజన కింద ఐదు కిలోల ఉచిత బియ్యం, ప్రతి కుటుంబంలోని మహిళకూ నెలకు రూ.2 వేలు, డిగ్రీ పూర్తి చేసిన రెండేళ్ల తర్వాత నుంచి నిరుద్యోగులకు ప్రత్యేక అలవెన్స్ హామీలు ఇందులో ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించాయని చెబుతారు.

ఇక తెలంగాణ విషయానికొస్తే... ఇక్కడ బీఆరెస్స్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను కొట్టిపారేయలేమని.. వాటిని కొట్టే పథకాలు తీసుకురావడం కూడా కష్టమని.. ఆల్ మోస్ట్ అన్నింటినీ తన హామీల్లో చేర్చేశారని చెబుతారు. ఈ సమయంలో బీఆరెస్స్ పథకాలకు ధీటుగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చింది. ఇది కూడా ప్రధానంగా సునీల్ కొనుగోలు వ్యూహాల ఫలితమే అని చెబుతున్నారు.

రాజస్థాన్ – మధ్యప్రదేశ్ లో అలా ఎలా?

కర్ణాటక, తెలంగాణ తరహాలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోనూ సునీల్ కనుగోలు బృందం ఇలాంటి సర్వేలను నిర్వహించింది. అయితే... వారి సూచనలను, సలహాలను అగ్రనేతలు పట్టించుకోలేదని అంటున్నారు. ఈ సమయంలో... బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు చాలా అవకాశాలున్నప్పటికీ అక్కడి కాంగ్రెస్‌ లో సమన్వయం కొరవడిందని.. సునీల్ కనుగోలు సూచనలను లైట్ తీసుకున్నారని అంటున్నారు.

ఇక ఛత్తీస్‌ గఢ్‌ లో కూడా సునీల్ పలు సలహాలు ఇచ్చారని అంటున్నారు. అందులో భాగంగా... గిరిజనుల మద్దతు ఉన్న పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలని సూచించారని.. ఆ పార్టీ అధినేత గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారని.. అవసరమైతే కాంగ్రెస్‌ లో విలీనం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారట. అయితే.. అందుకు అక్కడి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదని చెబుతుంటారు!

దీంతో... సునీల్ కనుగోలు సర్వేల ఫలితంగా తెలిపిన సూచనలు, సలహాలను అనుసరిస్తూ, వ్యూహాలను వింటూ, సమన్వయంతో పనిచేసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా... ఆయన వ్యూహాలను లైట్ తీసుకున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడిందని తెలుస్తుంది. మరి వచ్చే ఏడాది రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సునీల్ వ్యూహాలు ఎలాంటి ఫలితాలు కలిగిస్తాయనేది వేచి చూడాలి!