రేవంత్ తో వ్యూహకర్త కీలక భేటీ
పదులసంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతి నియోజకర్గానికి ప్రయారిటిలో మూడు దరఖాస్తులను ఎంపికచేసింది.
By: Tupaki Desk | 17 Feb 2024 2:18 PM ISTరేవంత్ రెడ్డితో తెలంగాణా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు భేటీ అయ్యారు. వీళ్ళిద్దరే అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లోనే సుమారు గంటసేపు మాట్లాడుకున్నారు. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు విషయంపైనే మాట్లాడుకున్నారని పార్టీవర్గాల సమాచారం. 17 నియోజకవర్గాల్లో టికెట్ల కోసం 309 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఆ దరఖాస్తులపై తెలంగాణా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ప్రదేశ్ ఎన్నికల కమిటి మొదటి సమావేశం నిర్వహించింది. దరఖాస్తులపై డీటైల్డ్ గా చర్చించి వడబోసింది.
పదులసంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతి నియోజకర్గానికి ప్రయారిటిలో మూడు దరఖాస్తులను ఎంపికచేసింది. ఈ దరఖాస్తులను పరిశీలన కోసం ఏఐసీసీకి పంపింది. ఢిల్లీలో మరో సమేవేశం తర్వాత అవే దరఖాస్తులను ప్రయారిటి బేసిస్ లో మళ్ళీ హైదరాబాద్ కే పంపుతారు. అంటే మూడు దరఖాస్తులకు టికెట్ ఇచ్చే విషయంలో ఏఐసీసీ ముఖ్యనేతలు రేటింగ్ ఇస్తారన్నమాట. ఈ రేటింగ్ ఆధారంగానే ప్రయారిటి ఉంటుంది. అవసరమైతే చివరి నిముషంలో ముగ్గురి ప్లేసులో కొత్త నేతను కూడా ఎంపికచేసే అవకాశముంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో ఇదే జరిగింది. ముందుగా అనుకున్నట్లుగా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపికచేసి బీఫారాలను కూడా ఇచ్చేశారు. అయితే చివరి నిముషంలో సర్వేలు జరిపించి నలుగురు అభ్యర్ధులను మార్చేసి కొత్తవారికి బీఫారాలు ఇచ్చారు. అప్పుడు కొత్తగా పిక్చర్లోకి వచ్చిన నలుగురు గెలిచారు. ఇపుడు కూడా అదే పద్దతిలో ఎంపిక జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. బహుశా ఇదే విషయాలను రేవంత్, సునీల్ మాట్లాడుకుని ఉండచ్చని పార్టీవర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈరోజు లేకపోతే రేపు వ్యూహకర్త ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా భేటీ అవబోతున్నట్లు సమాచారం. దక్షిణ తెలంగాణాలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపుకు ఎలాంటి సమస్యా లేదని సునీల్ చెప్పారట. ఉత్తర తెలంగాణాలోని మిగిలిన నియోజకవర్గాల్లో గెలుపు గురించే చర్చించుకున్నారట. రేవంత్ వ్యూహం సక్సెస్ అయితే తక్కువలో తక్కువ 15 నియోజకవర్గాలు గెలుస్తాయని పార్టీవర్గాల అంచనా వేస్తున్నాయి. అంటే పార్టీ గెలుపుకు రేవంత్ అంత పక్కాగా స్కెచ్ వేస్తున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.